గత వారం సరిగ్గా ఇదే రోజు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు గుర్తు తెలియని మెయిల్ వచ్చింది. ఢిల్లీ నుంచి టొరంటో వెళ్తున్న ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉండనేది ఆ మెయిల్ సారాంశం. అధికారులు, పోలీసుల్ని పరుగులు పెట్టించి ఆ మెయిల్ ను 13 ఏళ్ల కుర్రాడు పెట్టాడు. కేవలం సరదా కోసం ఈ పని చేశాడు.
విమానాన్ని క్షుణ్నంగా 12 గంటల పాటు చెక్ చేసిన పోలీసులు, అందులో ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్నారు. మెయిల్ ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
మీరట్ కు చెందిన 13 ఏళ్ల కుర్రాడు ఆ మెయిల్ పంపించాడు. కొన్ని న్యూస్ ఛానెల్స్ లో వచ్చిన కథనాలు చూసి తను కూడా అలా చేస్తే ఏమౌతుందో చూడాలనుకున్నాడు. పోలీసులు తనను కనిబెడతారా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా మెయిల్ ఐడీ సృష్టించాడు. తన తల్లి మొబైల్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్ పంపించాడు. ఆ వెంటనే మెయిల్ ఐడీని డిలీట్ చేశాడు. అయినప్పటికీ పోలీసులు గుర్తించారు.
కుర్రాడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం కుర్రాడికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.