షాకింగ్ సర్వే: మొబైల్స్ కు బానిసలుగా చిన్నారులు

కరోనా టైమ్ లో, ఆ తర్వాత పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం కామన్ గా మారింది. ఇదే అంశంపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది. అందులో వచ్చిన ఫలితాలు షాకింగ్ కు గురిచేశాయి. భారతదేశంలో…

కరోనా టైమ్ లో, ఆ తర్వాత పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం కామన్ గా మారింది. ఇదే అంశంపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది. అందులో వచ్చిన ఫలితాలు షాకింగ్ కు గురిచేశాయి. భారతదేశంలో బాల్యం మొబైల్ ఫోన్లకు బానిసగా మారింది. ఇది ఆందోళన కలిగించే అంశం.

సర్వే ప్రకారం, 40 శాతం కంటే ఎక్కువ పట్టణ భారతీయ తల్లిదండ్రులు.. తమ 9-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు.. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియాకు బానిసలయ్యారని అంగీకరించారు. ఈ “వ్యసనానికి” ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తున్నట్లు అంగీకరించారు.

తమను చూసి పిల్లలు మొబైల్స్ కు అలవాటుపడుతున్నారని 31 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించగా.. తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ అందించాల్సిన వయసు కంటే కాస్త ముందుగానే అందించడం వ్యసనానికి కారణమని 28శాతం మంది ఒప్పుకున్నారు. మరో 26 శాతం మంది మాత్రం కరోనా టైమ్ లో సెల్ ఫోన్లలో పాఠాలు బోధించడం వ్యసనానికి కారణమైందని ఆరోపించారు.

మహమ్మారి సమయంలో పిల్లలు వారి ఇళ్లకే పరిమితం కావడంతో స్క్రీన్-టైమ్ పెరిగింది. ఆన్‌లైన్ తరగతులతో పాటు, పిల్లలు వీడియోలు చూడటానికి, గేమ్‌లు ఆడటానికి, తమ తోటివారితో చాట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లను విరివిగా వాడారని సర్వేలో తేలింది.

దేశంలో కరోనా అంతరించిపోయినా, సెల్ ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని 287 జిల్లాల్లో నివసిస్తున్న తల్లిదండ్రుల నుండి ఈ సర్వేకు 65,000 పైగా స్పందనలు వచ్చాయి. దాదాపు 51 శాతం మంది మెట్రో మరియు టైర్-1 జిల్లాల నుంచి, 37 శాతం మంది టైర్-2 జిల్లాల నుంచి, 12 శాతం మంది టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి ఈ సర్వేలో పాల్గొన్నారు.

13-17 ఏళ్ల వయస్సు గల పిల్లల తల్లిదండ్రుల నుంచి 8,238 ప్రతిస్పందనలు రాగా.. వీళ్లలో 71 శాతం మంది తమ పిల్లలు రోజు మొత్తం లేదా రోజులో చాలా గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ తోనే ఉన్నారని తెలిపారు. 9-13 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల తల్లిదండ్రుల్లో 55 శాతం మంది, తమ పిల్లలకు పూర్తి రోజంతా స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉందని చెప్పారు.

ఓవరాల్ గా 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు రోజుకు కనీసం 3 గంటల పాటు సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని సర్వే తేల్చింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, పిల్లల్లో శారీరక పెరుగుదల మందగించడంతో పాటు, మానసిక సమస్యలు అధికమవుతాయని సర్వే హెచ్చరించింది.