మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రంలో ఒక గొప్ప డైలాగు ఉంటుంది. ఒక వ్యక్తిని హత్య చేయించిన విలన్.. దీపపు సమ్మెలో నూనెలో పడి చావబోతున్న ఒక చీమను కాపాడి బయటకు వేసి.. ‘‘ ఒక ప్రాణం తీశా ఒక ప్రాణం పోశా.. లెవలైపోయింది’’ అని అంటాడు. కేంద్రంలో ప్రస్తుతం అధికారం చాలా ఇస్తున్న బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది. ఈ కుటుంబంలోకి ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి చేరింది.. ఒక ప్రాంతీయ పార్టీ వారిని వీడి వెళ్ళింది. మొత్తానికి లెవెల్ అయిపోయింది.
వచ్చే ఏడాది పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. కొత్తబలాలను కూడా సమీకరించుకొని మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ఉబలాటపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తమ కూటమిలోకి కొత్త పార్టీలను కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల తమతో తలపడిన జేడీఎస్ పార్టీ ఇటీవల ఆ కూటమిలో చేరింది. దేవే గౌడ సారధ్యంలోని జెడిఎస్ తరఫున, కుమారస్వామి ఢిల్లీ వెళ్లి, అమిత్ షా తో భేటీ అయి.. మొత్తానికి జట్టులో చేరిపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జెడిఎస్ కు వేరే దారి లేకుండా పోయింది. అదే సమయంలో.. కర్ణాటకలో తాము మళ్లీ నిలదొక్కుకోవడం కష్టమనే భయం బిజెపిలో కూడా ప్రవేశించింది. మొత్తానికి ఈ ఇద్దరు కలిసి పోయారు.
అయితే, తాజాగా ఎన్డీఏ కూటమిలో ఉన్న తమిళనాడు పార్టీ.. అన్నాడీఎంకే జట్టు నుంచి వైదొలిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క తమిళనాడు రాష్ట్ర సారథి ఇటీవల అన్నాడీఎంకే గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఏర్పడి ఉన్న సంగతి . ఆ వైరం పర్యవసానమే అన్నట్లుగా.. తాజాగా అన్నాడీఎంకే ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నట్లుగా ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అన్నా డీఎంకే నాయకులు ఈ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నాటకలో ఒక పార్టీ వచ్చి చేరితే, తమిళనాడు లో ఒక పార్టీ వారిని వీడిపోయి.. ఎన్డీయే దక్షిణాది బలాలు లెవెలైపోయాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.