ఎయిరిండియా విమానంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పలు ఘటనలతో వార్తల్లోకెక్కిన ఈ ఎయిర్ లైన్స్, ఇప్పుడు మరో విచిత్ర ఘటనతో హెడ్ లైన్స్ లోకి మారింది. ఓ పైలట్, తన గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకెళ్లాడు. ఆమెతోనే ప్రయాణం మొత్తం సాగించాడు. ఆలస్యంగా వెలుగుచూసింది ఈ ఘటన.
ఫిబ్రవరి 27.. దుబాయ్ నుంచి ఢిల్లీ.. ఎయిరిండియా విమానం.. 3 గంటల ప్రయాణం.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల సీట్లలో కూర్చున్న తన గర్ల్ ఫ్రెండ్ ను పైలెట్, కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. కాక్ పిట్ లోనే ఆమెకు సకల మర్యాదలు చేశాడు. అక్కడే భోజన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి హుకుం జారీచేశాడు.
సిబ్బంది మినహా ఇతరులు ఇలా కాక్ పిట్ లోకి ప్రవేశించడం నిషేధం. ఎయిరిండియా విమానంలోనే కాదు, ఏ ఎయిర్ లైన్స్ కూడా దీన్ని సమర్థించదు. ప్రయాణికుల భద్రతకు అతిపెద్ద ముప్పుగా దీన్ని భావిస్తుంది. అలాంటి సున్నితమైన అంశాన్ని సదరు పైలెట్ పట్టించుకోలేదు. ఏకంగా 3 గంటల పాటు గర్ల్ ఫ్రెండ్ తో కాక్ పిట్ లోనే గడిపాడు.
ఇంతకీ ఈ మేటర్ ఎలా బయటకొచ్చిందో తెలుసా?
ఆరోజు విమానయాన సిబ్బందిలో ఒకరికి ఇగో హర్ట్ అయింది. గర్ల్ ఫ్రెండ్ ముందు సదరు పైలెట్, సిబ్బందిపై ఓవరాక్షన్ చేశాడు. అది సహించలేని సిబ్బందిలోని ఓ అమ్మాయి, నేరుగా వెళ్లి డీజీసీఏకి ఫిర్యాదు చేసింది. అక్కడ్నించి తీగ లాగితే డొంక కదిలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది.
నిజ నిర్థారణ జరిగిన తర్వాత పైలెట్ ను సస్పెండ్ చేస్తారు, ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు పైలెట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి.