అందమైన ప్రజాప్రతినిధుల జంట నవనీత్ కౌర్, ఆమె భర్త రవిరాణాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. ఇటీవలే జైలుకెళ్లి వచ్చిన ఆ జంటకు ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు జారీ చేసింది. ఇంటి అక్రమ నిర్మాణం చేపట్టారని, వారంలో కూల్చి వేయాలనేది ఆ నోటీసు హెచ్చరిక సారాంశం. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.
స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానా హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యారని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులకు బెయిల్‌పై బయటికొచ్చారు. తాజాగా వారిని మరో వివాదం చుట్టుముట్టింది.
మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రానా దంపతులు ఇంటి అక్రమ నిర్మాణం చేపట్టినట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని వారంలో తొలగించాలని శనివారం బీఎంసీ అధికారులు నవనీత్ రానా జంటకు నోటీసు జారీ చేశారు.
ఒకవేళ తమ నోటీసుకు స్పందించని పక్షంలో తామే కూల్చి వేస్తామని హెచ్చరించడం గమనార్హం. రాజకీయంగా ప్రభుత్వం కక్ష కడితే ఏమవుతుందో నవనీత్ రానా జంటకు ఎదురవుతున్న ఇబ్బందులే నిదర్శనం. ఏ చిన్న అవకాశం దొరికినా పాలకులు ప్రత్యర్థులను ఇరుకున పెట్టడం మహారాష్ట్రకే పరిమితం కాలేదు.
దేశ వ్యాప్తంగా ఈ ధోరణులు పెరిగిపోయాయి. ఇదిలా వుండగా తమకు నోటీసు జారీపై నవనీత్ కౌర్ జంట కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.