ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు కొత్త మోడల్ వచ్చినా దేశవిదేశాల్లో క్యూ కడతారు. కొత్త సిరీస్ దక్కించుకునేందుకు వేల రూపాయలు (ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది) ఖర్చుపెడుతుంటారు. అయితే అన్ని వేళలా ఐఫోన్ అనుభవం అద్భుతం అనుకుంటే తప్పు. కొన్నిసార్లు అది తంటాలు తెచ్చిపెడుతుంది కూడా.
ఇప్పుడదే జరుగుతోంది. వేలంవెర్రిగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు దక్కించుకున్న కొంతమంది వినియోగదారులు, ఇప్పుడు కొత్త సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
కొత్త ఐఫోన్ దక్కంచుకున్న చాలామంది వినియోగదారులు హీట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేవాళ్లు, ఇనస్టాగ్రామ్ యూజర్స్ ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది.
ఐవోఎస్-17లో బగ్ గుర్తించినట్టు వెల్లడించిన ఆపిల్ సంస్థ, తాజా 'ప్రో' మోడల్స్ లో టైటానియమ్ మెటీరియల్ తో పాటు అల్యూమినియం మిక్స్ చేయడం వల్ల హీట్ ఇష్యూ తలెత్తినట్టు అంగీకరించింది. ప్రస్తుతం తమ టెక్ నిపుణులు ఈ లోపాన్ని సవరించే పనిలో ఉన్నారని వెల్లడించింది.
ఓవైపు కంపెనీ ప్రకటించినప్పటికీ, మరోవైపు కొత్త మోడల్స్ లో కొత్తకొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఛార్జింగ్ లో ఫోన్ ఓవర్ గా వేడెక్కుతుందని కొంతమంది.. ఉబర్ యాప్ వినియోగిస్తున్నప్పుడు కూడా ఫోన్ వేడెక్కుతుందని మరికొంతమంది.. ఫొటోల్లో ఆప్షన్స్/ఫిల్టర్స్ ఎక్కువయ్యేకొద్దీ ఫోన్ వేడెక్కుతుందని మరికొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే కామన్ గా ప్రతి ఒక్క వినియోగదారుడు ప్రారంభంలోనే సమస్య ఎదుర్కొంటున్నాడు. కొత్త ఫోన్ ను ఇనస్టాల్ చేసినప్పుడు, బ్యాకప్/రీస్టోర్ ఆప్షన్ వాడినప్పుడు ఫోన్ విపరీతంగా వేడెక్కుతోంది. అయితే ఫోన్ లో ఓవర్ హీట్ వార్నింగ్ మెసేజ్ రానంతవరకు, వేడి అనిపించినా ఇబ్బంది లేదని చెబుతోంది కంపెనీ. త్వరలోనే ఈ వేడెక్కే సమస్యను అధిగమిస్తామని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న హీట్ ఇష్యూస్ వల్ల ఐఫోన్ పెర్ఫార్మెన్స్ దెబ్బతినదని, వినియోగదారుడికి ఎలాంటి హాని కలగదని హామీ ఇస్తోంది సంస్థ.