కామ కీచకుడు.. 15 మంది కాదు, ఏకంగా 142 మందిపై..!

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థినులపై కన్నేశాడు. లోబరుచుకోవడానికి ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరికి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. తన పాఠశాలలో చదువుతున్న 142 మంది విద్యార్థినులపై లైంగిక…

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థినులపై కన్నేశాడు. లోబరుచుకోవడానికి ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరికి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. తన పాఠశాలలో చదువుతున్న 142 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ ప్రిన్సిపాల్.

హర్యానాలోని జింద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ స్కూల్ కు చెందిన 15 మంది స్టూడెంట్స్, తమను హెడ్ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఏకంగా ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ముర్ముకు, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు లేఖలు రాయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఆ పాఠశాలకు చెందిన మేటరే.

అప్పుడు 15 మంది అనుకున్న విద్యార్థినుల సంఖ్య కాస్తా ఇప్పుడు 142కు చేరింది. లేఖ మేటర్ బయటకొచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ఈ కేసుపై ఓ కమిటీని ఏర్పాటుచేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేసిన ఈ కమిటీ.. 55 ఏళ్ల ప్రిన్సిపాల్ చేసిన అకృత్యాల్ని పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చింది.

15 మంది విద్యార్థినుల్ని విచారిస్తున్న సమయంలో ఆ సంఖ్య 60కి పెరిగింది. దీంతో ధైర్యం తెచ్చుకున్న మిగతా విద్యార్థినులు కూడా తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడానికి బయటకొచ్చారు. అలా ఈ సంఖ్య ఏకంగా 142కు చేరుకుంది. దీంతో కలెక్టర్ తో పాటు పోలీసులు కూడా అవాక్కయ్యారు.

లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ ను ఇప్పటికే సస్పెండ్ చేయగా, పోలీసులు అతడ్ని ఈనెల ప్రారంభంలోనే అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఆ కీచక ఉపాధ్యాయుడిపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయబోతున్నారు.

ఈ కేసును విచారించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. వాళ్లు 390 మంది అమ్మాయిల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. వీళ్లలో 142 మంది, సదరు ప్రిన్సిపల్ తమను లైంగికంగా వేధించినట్టు వెల్లడించగా.. మిగతా అమ్మాయిలు ఆ వేధింపుల్ని తాము కళ్లారా చూశామని చెప్పారు.