తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒక మోనార్క్. మొత్తం రాష్ట్ర రాజకీయాల సంగతి పక్కన పెట్టినా.. భారాసకు సంబంధించినంతవరకు ఆయన మాటకు తిరుగులేదు. అంతా ఆయన మాట ఫాలో అయ్యేవారే తప్ప.. ఆయన మాటను శిరసావహించేవారే తప్ప.. ఆయనకు కనీసం సలహా చెప్పగలవారు కూడా ఎవ్వరూ లేరు… అని అందరూ అనుకుంటూ ఉంటారు.
కానీ.. కేసీఆర్ నిర్ణయాలను ఇతరులు శాసించే పరిస్థితి ఆ పార్టీలో ఉందా? కుటుంబసభ్యులే ఆయనను కూడా శాసించేస్థాయికి వెళ్లారా? అనే సందేహం తాజాగా రాజకీయ వర్గాల్లో పుడుతోంది. ప్రత్యేకించి.. కేసీఆర్ తో నలభయ్యేళ్లుగా సాన్నిహిత్యం కలిగి ఉన్న నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున ఖమ్మం బరిలో తలపడుతున్న తుమ్మల నాగేశ్వరరావు మాటలను గమనిస్తే ఈ అభిప్రాయమే ఏర్పడుతుంది.
తుమ్మల నాగేశ్వరరావు ఒక న్యూస్ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారాసలో తనకు టికెట్ రాకపోవడం వెనుక జరిగిన హైడ్రామాను వివరించారు. నలభయ్యేళ్లుగా కేసీఆర్- తాను ఎంతో మంచి స్నేహితులం అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు తాను మంత్రి పదవి ఇప్పించిన మాట, ఖాళీగా ఉన్న తనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిన మాట రెండూ వాస్తవమేనని అన్నారు. గత ఎన్నికల్లో తన సొంత పార్టీ వారు చేటు చేసినందువల్లనే తాను 300 ఓట్ల తేడాతో ఓడిపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంలో కూడా తనకు కేసీఆర్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన మీద కేసీఆర్ కు ఎప్పటికీ సదభిప్రాయమే ఉంటుందని.. అయితే ఆయన మీద ఇతరుల ఒత్తిడి ఏమేరకు ఉన్నదో తనకు తెలియదని, ఇతరుల ఒత్తిడి కారణంగానే తనకు టికెట్ ఇవ్వలేదని తుమ్మల చెప్పారు. ఆ ఇతరులు కుటుంబసభ్యులే అని కూడా ధ్రువీకరించారు.
చూడబోతే.. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందిపుచ్చుకుంటారు.. అనే అంచనాలు ఎటూ ఉన్నాయి. అయితే కేటీఆర్ ఇప్పటి నుంచే.. కేసీఆర్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే వాతావరణం ఆ పార్టీలో ఉన్నదని అర్థమవుతోంది.
నిజానికి తుమ్మల నాగేశ్వరరావు- కేటీఆర్ పేరు చెప్పకపోయినప్పటికీ.. కుటుంబసభ్యులు అంటే అక్కడ ప్రభావశీలంగా ఉండే వ్యక్తులు కేటీఆర్, కవిత, హరీష్ రావు మాత్రమే. ఆ ముగ్గురిలో ఖమ్మం రాజకీయాల్లో వేలు పెట్టి, తుమ్మలకు టికెట్ రాకుండా చేయగలిగిన సత్తా కేటీఆర్ కు మాత్రమే ఉండగలదని పలువురు అంచనా వేస్తున్నారు.