అందాకా అతిషికి ఒక ‘ముఖ్య’ అందలం!

అక్కరకు వచ్చినప్పుడే అతివలు గుర్తుకొస్తారు. అన్ని రంగాల్లోనూ ఇదే వరస. రాజకీయాల్లో అయితే మరీను. అరవింద్‌ కేజ్రీవాల్‌ కు అత్యవసరంగా ఒక మహిళ గుర్తుకొచ్చారు. ఏకంగా తన స్థానాన్ని భర్తీ చెయ్యటానికే. అవును. ఢిల్లీ…

అక్కరకు వచ్చినప్పుడే అతివలు గుర్తుకొస్తారు. అన్ని రంగాల్లోనూ ఇదే వరస. రాజకీయాల్లో అయితే మరీను. అరవింద్‌ కేజ్రీవాల్‌ కు అత్యవసరంగా ఒక మహిళ గుర్తుకొచ్చారు. ఏకంగా తన స్థానాన్ని భర్తీ చెయ్యటానికే. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంమీదకే. ఆ మహిళ కూడా అత్యంత విధేయురాలయి వుండాలి. అందుకు మంత్రిగా వున్న అతిషిని ఎంపిక చేశారు. నిజానికి తన భార్య సునీతా కేజ్రీవాల్‌నే ఆ స్థానంలో కూర్చోబెట్టవచ్చు. ఈ ప్రయోగం బీహార్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎప్పుడో చేసేశారు. బీహార్‌ ముఖ్యమంత్రిగా తన భార్య రబ్రీదేవిని కూర్చోబెట్టారు. ఒక ఏడూ, రెండేళ్ళూ కాదు. ఏకంగా ఏడేళ్ళకు పైగా ఆమె వున్నారు. రబ్రీ పాలిస్తుంటే, జైల్లో వున్నా లాలూ నిశ్చింతగా వున్నారు. కేజ్రీవాల్‌ కూడా ఈ పని చేసి వుంటే, ఆయన వరకూ క్షేమకరంగా వుండేది. కానీ అలా చెయ్యలేదు. కారణాలు రెండు. ఒకటి ఆదర్శం, రెండు అవసరం.

‘కుబుంబ పాలన’ మీద వీలు దొరికినప్పుడెల్లా విరుచుకు పడ్డ అరవిందునికి ఆ మచ్చ పడకూడదు. భార్యను తన స్థానంలో పెడితే, తన ‘నీతే’ తాను తప్పినట్టుంటుంది. వెలుపలి వారిని పెడితే ఆదర్శవంతుడన్న పేరు అందాకా పొందవచ్చు. సునీత కేజ్రీవాల్‌ ను కుర్చీలో కూర్చోబెట్టేటంత పెద్ద అవకాశమేదీ ఇది కాదు. ఢిల్లీ అసెంబ్లీకి పుణ్యకాలం పూర్తవుతోంది. యధాప్రకారం జరిగితే వచ్చే (2025) ఫిబ్రవరిలో జరగాలి. అంటే పట్టుమని అయిదు నెలలు కూడా లేదు. అలాకాక, కేజ్రీవాల్‌ కోరిక మేరకు, ఎన్నికల కమిషన్‌ ముందుకు జరిపి మహారాష్ట్ర ఎన్నికలతో పాటు కానిస్తే, ఈ ఏడాది నవంబరులోనే జరపాలి. అప్పుడు ముచ్చటగా మూడు నెలలు కూడా లేదు. ఈ మాత్రం భాగ్యానికి ‘సొంతింటి వారసురాలి’(భార్యను) దించాల్సిన అవసరంలేదు.

అవసరమో, ఆదర్శమో ఏదయితేనేం? మొత్తానికి దేశంలో ఇప్పుడు, మళ్ళీ ఇన్నేళ్ళకు, ఏకకాలం లో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులను చూడగలుతున్నాం. (పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వుండనే వున్నారు.) ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద అతిషి కూర్చోవటంతో ఇద్దరవుతారు.అతిషి! పూర్తి పేరు అతిషి మార్లెనా సింగ్‌. చివర్న వున్న ‘సింగ్‌’ ఎలా వున్నా, మధ్యలోవున్న ‘మార్లెనా’తో ఆమెకు చిక్కొచ్చిపడిరది. అది కూడా ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టే ముందే. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు ఇంకో ఏడాదిలో వస్తాయనగా ఆమె అతిషిగా మాత్రమే ఢిల్లీ వోటర్లకు తెలియాలనుకున్నారు. అందుకు కారణంలేక పోలేదు.

‘మార్లెనా’ అన్నది హిందువులు పెట్టుకునే పేరులా కనిపించక పోవటం వల్ల తనకు నష్టం జరుగుతుందని ఆమె ఆలోచించారు. ఈ ఆలోచనకూడా అప్‌ అధినాయకత్వం సూచనలనుంచే వచ్చి వుండవచ్చు. ఆ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఒక ఆప్‌ సీనియర్‌ నేత వివరణ కూడా ఇచ్చారు. అంతే కాదు, అతిషి కులాన్ని, అసలు ప్రాంతాన్నీ (పంజాబీ రాజ్‌ పుట్‌) ఒక సీనియర్‌ నేత బహిరంగ పరిస్తే, అందుకు ఎన్నికల సంఘం నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి.

నిజానికి ‘మార్లెనా’ పేరు మతాన్నించి రాలేదు. తల్లితండ్రులు నమ్మిన సిధ్ధాంతాన్నుంచి వచ్చింది. కార్ల్‌ మార్క్స్‌ లోని ‘మార్క్స్‌’నూ, వ్లదమీర్‌ లెనిన్‌ లోని ‘లెనిన్‌’నూ తీసుకుని అత్యంత సృజనాత్మకంగా ‘మార్‌`లెనా’ అని పేరు పెట్టారు. (తెలుగు కవి శ్రీశ్రీ కూడా తన తనయకు ‘లెనిన్‌’ పేర్నే ‘లెనీనా’మార్చి పెట్టారు. ఈ తరహా నామకరణాలు కొత్త కాదు.) చిత్రమేమిటంటే, అతిషి అక్కకు కూడా ఇలాగే ఒక మార్క్సిస్టు పేరు పెట్టారు. పోలండు`జర్మనీ సోషలిస్టు విప్లవకారిణి రోజా లగ్జెంబర్గ్‌ లోక ప్రసిధ్దురాలు. ఆమె పేరు కలిసేలా ‘రోజా బాసంతి’ అని పెట్టారు.

కారణం స్పష్టమవుతూనే వుంది. తల్లితండ్రులు భావజాల రీత్యా మార్క్సిస్టులు. తండ్రి విజయ్‌ సింగ్‌, తల్లి తృప్తా వాహి ఇద్దరూ ఢిల్లీ యూనివర్శిటీలో చరిత్రను బోధించే అధ్యాపకులు. కానీ తానున్న ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ అప్పటికే బీజేపీని ఢీకొనటానికి ‘సాత్విక హిందూత్వ’ను కప్పుకుంది. కాబట్టి ఆమెకు ఈ పేరువల్ల ఇబ్బంది వస్తుందనే ఉద్దేశ్యంతో ‘అతిషి’గానే 2019 పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగారు. వ్రతం చెడ్డా, ఫలం దక్కలేదు. ఈస్ట్‌ ఢిల్లీ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధి గౌతం గంభీర్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. (ఆప్‌ ఢిల్లీనుంచి అసెంబ్లీ ఎన్నికలలో చూపిన విజయాలను అసెంబ్లీ ఎన్నికలలో చూపలేదు. అది వేరే విషయం). కానీ 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం కాల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇలా మొదటి సారి అసెంబ్లీ కి వచ్చిన అతిషి, వెంటనే మంత్రివర్గంలో చోటు సంపాదించటమే కాకుండా, ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికి ఎంపికయ్యే వరకూ ఎదిగిపోయారు.

అయితే ఢిల్లీ వరకూ మహిళ ముఖ్యమంత్రి కావటం కొత్తకాదు. లెక్క తీస్తే, అతిషి ఈ అవకాశాన్ని పొందుతున్న మూడవ మహిళ అవుతారు. ముందు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్‌ అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ నుంచి షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా వున్నారు. కానీ సుష్మాస్వరాజ్‌ పట్టుమని రెండు నెలలు కూడా చెయ్యలేదు. ఆమె ముఖ్యమంత్రిగా వున్నది 52 రోజులే. కానీ షీలా దీక్షిత్‌ ఇదే ఢిల్లీకి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ‘హ్యాట్రిక్‌’ కొట్టటమే కాకుండా 15 యేళ్ళు ఏకబిగిన ఢిల్లీని పాలించారు. (ఢిల్లీ సీఎంగానే కాదు, దేశంలోనే మహిళా ముఖ్యమంత్రుల్లో ఇప్పటి వరకూ ఆమెదే రికార్డు.) అతిషి ఎలాగూ స్వల్ప కాలమే చేస్తారు. మళ్ళీ ఆప్‌ అధికారంలోకి వస్తే ఎలాగూ కేజ్రీవాలే ఆ పీఠంలో కూర్చుంటారు.

జైలునుంచి ‘లిక్కర్‌ స్కాం కేసులో’ బెయిలు పొంది విడుదలయిన తర్వాత కేజ్రీవాల్‌ తీసుకున్న ఈ నిర్ణయం పేరు ‘అగ్ని పరీక్ష’. తాను ప్రజల తీర్పును కోరుతున్నాననీ, ఈ ఎన్నికలలో ప్రజలు తనకు ‘నిష్కళంకుడు’ అని తీర్పు ఇస్తేనే తప్ప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోనంటున్నారు. అందాకా ఒక ముఖ్యమంత్రి కావాలి కాబట్టి, అతిషికి ఒక అవకాశం. అంతే కాకుండా, ‘బెయిలు షరతుల’తో తాను సీఎంగా వుంటే, ‘జనాకర్షక పథకాల’ను తాను థారాళంగా అమలు జరపలేడు. ఈ విరామంలో ఒక ముఖ్యమంత్రి కావాలి. అందుకు మహిళయితే మరీ మంచిది. కాబట్టే అతిషి ఎంపికయ్యారు. ‘అందాకా’ స్థానాలు తప్ప, మగనేతలు మహిళలకు ‘శాశ్వతావకాశాలు’ ఇవ్వరా..!?

5 Replies to “అందాకా అతిషికి ఒక ‘ముఖ్య’ అందలం!”

  1. కరుణనిధి ఫ్యామిలీ తమిళం పేర్లు గురించి ప్రచారం చేస్తారు కాని స్టాలిన్ కి విదేశీ పేరు!

  2. డీప్ స్టేట్ ఆదేశాల మేర కే కేజరివాల్ మూవ్మెంట్ లు ఉంటాయని సోషల్ మీడియా చెబుతుంది.

  3. ఇంకో జితన్ రామ్ మంజి…..చంపెయ్ సొరేన్ ల అవ్వకపోతే అంతే చాలు….ఐన ఎందుకొచ్చిన అధికార మార్పిడి మల్ల తానే(మే) వస్తాము అనుకుంటే ముందస్తు కి పొతే అయిపోయింది కదా….

Comments are closed.