లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎనిమిది నెలలుగా జైల్లో వుంటున్న సిసోడియాకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కకపోవడంతో చంద్రబాబుతో సహా టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా చంద్రబాబు వుంటున్నారు. ఏపీ హైకోర్టులో బాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగుతోంది. అలాగే బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్‌లో ఉంచారు. నవంబర్ 8న తీర్పు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కార్యాచరణ గమిస్తే ఊరట దక్కుతుందనే ఆశలు సన్నగిల్లాయి. అందుకే చంద్రబాబు సతీమణి నిజం గెలవాలంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో లోకేశ్ కూడా బస్సయాత్రకు సిద్ధమవుతున్నారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా విషయానికి వస్తే మద్యం కుంభకోణం కేసులో మొదట ఆయన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9న ఈడీ కూడా సిసోడియాను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఆయన 8 నెలలుగా వుంటున్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 17న తీర్పు రిజర్వ్ చేసింది. సిసోడియాకు బెయిల్ నిరాకరిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. లిక్కర్ కుంభకోణంలో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ ఆధారాలు చూపిందని, అందుకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాగే కేసు విచారణకు 6 నుంచి 8 నెలల సమయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒకవేళ విచారణ నెమ్మదిగా సాగితే మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిసోడియా అర్హత పొందుతారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సిసోడియా కేసులో సుప్రీంకోర్టు సీరియస్‌గా వుండడాన్ని పరిశీలిస్తే, చంద్రబాబుకు కూడా ఊరట దక్కదేమో అన్న భయం టీడీపీని వెంటాడుతోంది.
ఎందుకంటే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రకు సంబంధించి అన్ని రకాల ఆధారాలను న్యాయస్థానాల ఎదుట సీఐడీ వుంచింది. అందుకే బాబుకు కింది కోర్టుల్లో కూడా ఊరట దక్కలేదనే చర్చకు తెరలేచింది. బాబు అవినీతికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయని, అందువల్ల మరికొన్ని నెలలు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది.
బాబు అవినీతికి పాల్పడినట్టు ఒక్క ఆధారమైనా చూపించగలరా అని లోకేశ్ ప్రశ్నించడంపై అధికార పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయస్థానాలకు ఆధారాలు ఇస్తాం తప్ప, దొంగలకు ఎందుకు ఇస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిసోడియాకు ఏ విధంగా అయితే న్యాయస్థానాల్లో ఊరట లభించడం లేదో, స్కిల్ స్కామ్‌లో బాబుకు కూడా అదే గతి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.