ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లి, అట్నుంచి అటు అక్రమంగా ఇండియాకొచ్చిన సీమా హైదర్ ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటిదే. ప్రియుడి కోసం ఈసారి మరో మహిళ, ఇండియాలోకి అక్రమంగా చొరబడింది. అయితే ఈసారి పాక్ నుంచి కాదు, బంగ్లాదేశ్ నుంచి.
బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా నూర్, తన దేశం నుంచి త్రిపురలోని ధర్మసాగర్ డివిజన్ లో ఉన్న పుల్బరీకి చేరుకుంది. అక్కడే తన ప్రియుడు నూర్ జలాల్ ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి రెండు వారాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అలా పరిచయం.. ఇలా జంప్..
రంగంలోకి దిగిన పోలీసులు.. ఫాతిమాను అదుపులోకి తీసుకొని, కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు 2 వారాల రిమాండ్ విధించింది. ధర్మసాగర్ కు చెందిన జలాల్, ఆయుర్వేద మందుల కోసం బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్న మౌళ్వీ బజార్ కు వెళ్తుంటాడు. ఇది అతడికి చాలా కామన్. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన ఫాతిమా పరిచయమైంది.
ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమలో ఇక ఇద్దరూ ఆగలేకపోయారు. ఎడబాటు తట్టుకోలేకపోయారు. ముందుగా ఫాతిమానే చొరవ చూపింది. ప్రియుడితో కలిసి ఇండియాకు వచ్చేసింది.
అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఫాతిమాకు ఆల్రెడీ పెళ్లయింది. ఇటు జలాల్ కు కూడా పెళ్లయింది. అయినప్పటికీ ఇద్దరూ కలిసి మర ఇంట్లో కాపురం పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో జలాల్ పరారయ్యాడు. ఫాతిమా జైళ్లో ఉంది.