పహల్గాం లో పర్యాటకుల మీద జరిగిన అత్యంత దుర్మార్గమైన ఉగ్రదాడి తర్వాత.. ఉగ్రవాదాని నిర్మూలిస్తాం అని భారత్ర స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యంత హేయమైన ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు భూమిమీద ఎక్కడ దాక్కున్నా సరే.. వారిని వేటాడి తీరుతాం అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ మాటలను నిరూపించుకుంటూ.. కేవలం పీఓకే లో వేర్వేరు పాంతాల్లో విస్తరించి ఉన్న ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న శిబిరాల మీద మాత్రమే భారత్ ఆపరేషన్ సింధూర్ దాడులు చేసింది. భారత్ దాడిచేసినది చాలా స్పష్టంగా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే కాగా.. దీనికి అనుచితమైన రీతిలో రంగు పులిమి.. పౌరులపై దాడులు చేసినట్టుగా నిందలు వేస్తూ.. తాము దాడులకు దిగతాలని పాకిస్తాన్ కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవసరమైతే వైమానిక దాడులను విస్తృతంగా సాగించడానికి కూడా వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
పాకిస్తాన్ లో లాహోర్, సియాల్ కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టుగా పాక్ ప్రకటించింది. అవసరమైతే ఆ విమానాశ్రయాలనుంచి కూడా వైమానిక దాడులు లాంచ్ చేయడం కోసమే వాటిని మూసివేసినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో.. పాక్ ఈ నిర్ణయం తీసుకున్న తరువాత.. భారత్ కూడా శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ ను కూడా మూసి వేసింది. పాక్ వైపు నుంచి వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానించడంతో.. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే.. సమర్థంగా ఎదుర్కోడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ధర్మశాల, లే, లడఖ్, జమ్మూ కాశ్మీర్, అమృతసర్ లలో కూడా ముందుజాగ్రత్తగా విమానాశ్రయాలను కూడా భారత్ మూసి వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే అహ్మదాబాద్, ముంబాయి విమానాశ్రయాలనుంచి గగనతలాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ!
అధికారికంగా ఎమర్జెన్సీ అనే ప్రకటన రాలేదు గానీ.. దాదాపుగా ఎమర్జెన్సీ వాతావరణం పాకిస్తాన్ వ్యాప్తంగా నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. అలాగే ఇస్లామాబాద్ లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య విభాగంలో సెలవులు మొత్తం రద్దయ్యాయి. అందరూ అందుబాటులో ఉండాల్సిందిగా హెచ్చరించారు. మొత్తానికి పాకిస్తాన్ యుద్ధోన్మాదంతో పెట్రేగిపోతున్నట్టుగా అర్థమవుతోంది.