భారత్ సైన్యం క్రూయిజ్ మిసైళ్ల ద్వారా, హేమర్ స్మార్ట్ బాంబులను ప్రయోగించి.. ఆపరేషన్ సింధూర్ దాడులను నిర్వహించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాడుల్లో లక్ష్యించిన ఉగ్రవాద శిబిరాలు తప్ప.. మరే ఇతర నష్టం జరగకుండా.. పొరబాటున కూడా పౌర ఆవాసాలమీద బాంబులు పడకుండా ఉండేందుకు అత్యంత కచ్చితత్వంతో కూడిన ఈ హేమర్ స్మార్ట్ బాంబులను, క్రూయిజ్ మిసైళ్లను సైన్యం ఉపయోగించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
హేమర్ స్టార్ట్ బాంబ్ అంటే.. చాలా కచ్చితత్వంతో పనిచేసే బాంబుగా పరిగణిస్తారు. HAMMER smart Bomb అంటే.. హైలీ అజైల్ మాడ్యులార్ మ్యూనిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ అని అంటారు. కచ్చితత్వానికి ప్రతీక అయిన ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్ (PGM) వర్గానికి చెందిన ఆయుధాలు ఇవి. క్షిపణి మరియు గ్లైడ్ బాంబ్ యొక్క రెండు లక్షణాలను కూడా కలిపినట్లుగా ఈ హేమర్ స్మార్ట్ బాంబులు పనిచేస్తాయి. విస్తృతమైన పరిధిలో.. అత్యంత కచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించడానికి ఈ ఖరీదైన బాంబులను ఆపరేషన్ సింధూర్ దాడుల్లో వాడినట్టుగా తెలుస్తోంది.
సవాళ్లతో కూడిన భూభాగాల్లో ప్రయోగించడానికి వీటిని ఉపయోగిస్తారు. అలాగే అతి తక్కువ ఎత్తుల్లో ప్రయోగించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. సాధారణ బాంబులకు ప్రొపల్షన్ కిట్ మరియు గైడెన్స్ కిట్ లను కూడా జోడించడం వల్ల హేమర్ స్మార్ట్ బాంబులు అంత కచ్చితత్వంతో పనిచేస్తాయని తెలుస్తోంది.
ఇవి విస్తృతమైన పరిధిని కలిగిన బాంబులు కావడం వల్ల.. వీటిని ప్రయోగించే యుద్ధ విమానాలు ప్రత్యర్థుల వైమానిక దాడులకు అందనంత దూరంలో ఉండి ప్రయోగించడం వీలవుతుంది.
ఈ హేమర్ స్మార్ట్ బాంబులలో 125 కిలోలు, 250 కిలోలు, 500 కిలోలు, వెయ్యి కిలోలు బరువైన బాంబులు కూడా ఉంటాయి. వీటిలో బంకర్ లను ధ్వంసం చేసే సామర్థ్యం గల బాంబులు కూడా ఉంటాయి. అయితే.. మంగళవారం రాత్రి జరిగిన దాడుల్లో భారత సైన్యం హేమర్ స్మార్ట్ బాంబులను ప్రయోగించినట్టు వార్తలు వస్తున్నాయి గానీ.. ఏ స్థాయి సామర్థ్యంగల బాంబులు అనేది తెలియలేదు.
అలాగ వీటిని క్రూయిజ్ మిసైళ్ల ద్వారా ప్రయోగించినట్టు తెలుస్తోంది. క్రూయిజ్ మిసైళ్లు అంటే బాలిస్టిక్ మిసైళ్ల కంటె భిన్నమైనవి. అత్యంత ఆధునాతనమైనవి. బాలిస్టిక్ క్షిపణి అనేది గ్రావిటీ ఆధారంగా పనిచేస్తుంది. అయితే క్రూయిజ్ మిసైళ్లు నిర్దిష్టమైన కక్ష్యలో ఎగరడానికి సొంత ఇంజిన్ ను కూడా కలిగి ఉంటుంది.
దాడుల్లో ఎలాంటి పొరబాటు జరగకుండా ఉండేందుకు.. తాము ఎంపిక చేసిన నిర్దిష్టమైన ఉగ్రవాద స్థావరాల మీద తప్ప పొరబాట్న కూడా పౌర ఆవాసాలపై దాడిజరగకుండా ఉండేందుకే.. భారత సైన్యం అత్యంత ఖరీదైన ఈ హేమర్ స్మార్ట్ బాంబులను, క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించినట్టుగా నిపుణులు భావిస్తున్నారు.
భారత్ మత కి జై, జై హింద్.