మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 1.28 గంటలకు ప్రారంభించి.. పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
అర్ధరాత్రి దాటిన తర్వాత.. చోటుచేసుకున్న ఈ దాడులకు భారత్ ఒక్కసారిగా మేలుకుంది. ఆపరేషన్ సింధూర్ దాడులకు సంబంధించి, ఆన్ లైన్ లో వస్తున్న వార్తలు, పోస్టులపై నెటిజన్ల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత.. అధికారికమైన రెండు ఎక్స్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 1.28 గంటలకు దాడులు ప్రారంభించినట్టుగా భారత్ సైన్యం ప్రకటించింది. అలాగే దాడులకు సంబంధించి రాత్రి 1.44 గంటలకు ప్రభుత్వం తొలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రం ఎంపిక చేసి, దాడులు చేసినట్టుగా సైన్యం తమ ప్రకటనలో పేర్కొంది.
అలాగే దాడలకు సంబంధించి ‘న్యాయం చేశాం’ (justice served) అంటూ భారత్ సైన్యం పెట్టిన ఎక్స్ పోస్టు ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది. రాత్రి 1.51 గంటలకు ఇండియన్ ఆర్మీ ఈ పోస్టు పెట్టగా.. కేవలం ఒకటిన్నర గంట వ్యవధిలో 35 లక్షల మందికి పైగా ఈట్వీట్ ను వీక్షించారు. పదివేల మందికి పైగా కామెంట్లు చేశారు. అలాగే 28వేల మంది వరకు రీపోస్టు చేశారు. లక్ష మంది వరకు లైక్ చేశారు.
అలాగే భారత రక్షణ శాఖ మంత్రి కూడా ఈ దాడులను ధ్రువీకరిస్తూ ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. వైమానిక దాడులు ప్రారంభమైన సుమారు గంటసేపటి తర్వాత 2.46 గంటలకు ‘భారత్ మాతాకీ జై’ అనే పోస్టు పెట్టారు.
నలభై నిమిషాలు కూడా గడవక ముందే ఈ పోస్టును పది లక్షల మంది వీక్షించారు. అయిదువేల మంది వరకు కామెంట్లు చేయగా, దాదాపు పదివేల మంది దీనిని రీపోస్ట్ చేశారు. అలాగే యాభైవేల మందికి పైగా లైక్ చేశారు.
మరొకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత దాడులు త్వరగానే ముగుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పోస్టులు ఇంటరనెట్ లో వైరల్ అవుతున్నాయి. పీఓకే ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ దాడులకు సంబంధించి వెల్లువెత్తుతున్న ప్రతి పోస్టులను కూడా నెటిజన్లు విస్తృతంగా చూస్తున్నారు. భారత దాడులకు భారీగా మద్దతు వెల్లువెత్తుతోంది.