మొత్తానికి క్రమంగా కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లను బీజేపీ నేతలుగా అన్వయించుకోవాల్సి వస్తోంది దేశ ప్రజానీకం. ఇన్నాళ్లూ కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జిలుగా, ఏఐసీసీ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షంలోని నేతలుగా, వివిధ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు.. ఇలాంటి పదవుల్లో వినిపించిన నేతల పేర్లు ఇక నుంచి బీజేపీ కార్యవర్గ సభ్యులు, బీజేపీ కార్యనిర్వాహక విభాగం ముఖ్య ఆహ్వానితులు.. ఇలాంటి హోదాల్లో వినిపించబోతున్నాయి!
ఇప్పటికే ఏపీ వంటి రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ మాజీలు బీజేపీ నేతలు అయిపోయారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో చక్రాలు తిప్పిన వారు, నాటి కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వం (ఇది బీజేపీ ఇచ్చిన బిరుదే)లో కేంద్ర మంత్రులుగా వ్యవహరించిన వారు.. ఇలాంటి వాళ్లంతా బీజేపీ చేరికల కమిటీ నేతలుగా, బీజేపీ నేతలుగా వెలుగొందుతూ ఉన్నారు!
తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఇదే కథ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు నుంచి హల్చల్ చేసిన పలువురు నేతలు ఇప్పుడు బీజేపీకి ముఖ్య నేతలు. అప్పట్లో బీజేపీ వీళ్ల దిష్టిబొమ్మలు కూడా కాల్చింది. వారే ఇప్పుడు బీజేపీ స్టేట్ లెవల్ నేతలు. కర్ణాటకలో అయితే వివాదాస్పదులు, అవినీతి పరులు అంటూ బీజేపీ నిందించిన వారిని చేర్చుకుని ప్రస్తుత ప్రభుత్వాన్ని కాపాడుకుంటోంది. ఇలా అంతా కాంగ్రెస్ మయం అవుతోంది కాషాయ పార్టీ.
ఇదే ఊపులో పంజాబ్ కాంగ్రెస్ మాజీలకు బీజేపీ జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం గమనార్హం. పంజాబ్ మాజీ సీఎం అమరీందీర్ సింగ్, పంజాబ్ పీసీసీ మాజీ ప్రెసిడెంట్ జక్కర్ లకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక విభాగంలో బరువైన బాధ్యతలు పెట్టింది! ఇక నుంచి వీరు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలుగా చలామణిలో ఉంటారనమాట!
మొన్నటి పంజాబ్ ఎన్నికల ముందు వరకూ అమరీందర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది. బీజేపీ భాషలో చెప్పాలంటే సోనియా- రాహుల్ లకు జస్ట్ బానిస! అంతకన్నా కట్టు బానిస జక్కర్. వీరి వ్యక్తిగత అర్హతలు, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నా బీజేపీ వీరిని జస్ట్ సోనియా పప్పెట్స్ అనేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వీళ్లకు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పదవులు, బాధ్యతలు ఇచ్చి తరిస్తోంది! ఈ జాబితా ఇప్పట్లో పూర్తయ్యేది కూడా కాదు. ఇంకా బోలెడంతమంది కాంగ్రెస్ మాజీలకూ, బీజేపీలో చేరబోయే కాంగ్రెస్ నేతలకూ ఇలాంటి మర్యాదలు దక్కడం కొనసాగవచ్చు.