గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో బ్రిడ్జి మీద నుండి వెళుతున్న సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోవడంతో పలువురు చనిపోవడంతో పాటు చాల మంది తీవ్రంగా గాయపడ్డినట్లు సమాచారం.
నదిలో దాదాపు 400 వంది సందర్శకులు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మోర్బీ కేబుల్ వంతెన చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడం. ఇటీవల బ్రిడ్జ్ మరమ్మత్తు చేసిన తర్వాత, గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న వంతెనను ప్రారంభించారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం తక్షణమే బృందాలను పంపించాలని మోడీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఒక ప్రకటన పేర్కొంది.