ఫోటోల గోల తప్ప వారికి మరోటి కనపడదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఇటీవలి కాలంలో విరివిగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్న వాటిని వారు ప్రత్యేకంగా పరిశీలించారు. సమీక్షించారు.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఇటీవలి కాలంలో విరివిగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్న వాటిని వారు ప్రత్యేకంగా పరిశీలించారు. సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. కేంద్రమంత్రులు రాష్ట్రాల్లో పర్యటించడం కొత్త విషయం కాదు. తప్పు కాదు. కానీ.. ప్రత్యేకించి బీజేపీకి చెందిన కేంద్రమంత్రుల పర్యటనలు యావత్తూ ఒకే అంశం చుట్టూ తిరిగాయి. ‘మీ పథకాల మీద మా మోడీ ఫోటో లేదు ఎందుకు?’ అనే అంశం ఒక్కటే వారి ఏడుపు.

సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతోనే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి డబ్బు చెల్లించే ప్రజలు, ప్రభుత్వం నుంచి డబ్బు పొందే ప్రజలు వేర్వేరుగా ఉండవచ్చు గాక.. కానీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టే పద్ధతి మాత్రం అదే. అయితే క్షేత్రస్థాయిలో పథకాలను నిర్వహిస్తుండేది రాష్ట్ర ప్రభుత్వం గనుక.. వారి ద్వారానే అమలు జరుగుతూ ఉంటుంది గనుక.. ఆ ప్రభుత్వాలకే క్రెడిట్ దక్కడం చాలా సాధారణమైన విషయం. ఆ పాయింట్ దగ్గరే బీజేపీకి చెందిన కేంద్రమంత్రులకు ఏడుపు వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో పర్యటించిన వారు అక్కడి పథకాల మీద మోడీ ఫోటోలేదని విలపించారు. స్థానిక అధికార్లను నిలదీశారు. వారి ఓవరాక్షన్ కు తగ్గట్టుగానే.. అధికారులు కూడా.. కేంద్రమంత్రులు వస్తున్నప్పుడు.. అక్కడి పోస్టర్ల మీద మోడీ ఫోటో కూడా ఉంచడం, ఆ తర్వాత తొలగించడం లాంటి మధ్యేమార్గాలను అనుసరించారు. 

ఒక కేంద్రమంత్రి గారైతే.. రాష్ట్రంలో అధికారికంగా పర్యటించిన తర్వాత.. ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో.. తన పర్యటనలో గమనించిన విషయాలు, తెలుసుకున్న సంగతులు చెప్పవలసింది బదులుగా.. కేంద్రం డబ్బులిస్తున్నా సరే.. మోడీ ఫోటో ముద్రించడం లేదంటూ వాపోవడం విశేషం. నిజానికి బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ప్రతిచోటా.. ఆ పార్టీ నాయకులు ఇదే మాటలను వల్లిస్తూనే ఉంటారు. ఏపీ విషయంలోనూ.. రాష్ట్ర నాయకులు అనేక దఫాలుగా.. ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 

వాస్తవాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం అమలవుతున్నదంటే.. కేంద్రం ఇచ్చే దెంత.. రాష్ట్రం భరిస్తున్నది ఎంత? అనేది చాలా కీలకం. కేంద్ర ప్రభుత్వం గోరంత వాటా ఇస్తూ.. కొండంత ప్రచారాన్ని కోరుకుంటోంది. ఆరోగ్యం విషయంలో అయినా, పెన్షన్ల విషయంలో అయినా.. రాష్ట్రం భరిస్తున్న వాటాలను, కేంద్రం భరిస్తున్న వాటాలను లెక్కకట్టి.. ఆ మేరకు భారీ సైజులో జగన్ ఫోటో ముద్రించి.. దాని పక్కనే అంగుష్ఠ మాత్రుడిగా.. ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ముద్రిస్తే వారికి ఓకేనా? అనే ప్రశ్న ప్రజలనుంచి ఎదురవుతోంది? అమలవుతున్న సంక్షేమంలో పరిమితమైన వాటా మాత్రమే కేంద్రానిది కాగా, వారు అతి ప్రచారాన్ని, లేదా సమాన ప్రాధాన్యాన్ని ఎలా కోరుకుంటారు? అనేది చర్చనీయాంశం. 

కేంద్రమంత్రులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారంటే.. ఆ రాష్ట్రానికి ఇంకా తాము కేంద్రం నుంచి ఏమేం చేయబోతున్నామో చెప్పేలా, అక్కడి ప్రజల మనసులు గెలుచుకునేలా ఉండాలి. అదేమీ లేకుండా.. మోడీ ఫోటో వేశారా లేదా అని పరిశీలించడం ఒక్కటే లక్ష్యంగా వీరు తిరుగుతున్నట్లుంది.