సాయిపల్లవి పెళ్లికి రెడీ అయిందా? ఆమె కోసం వరుడు సిద్ధంగా ఉన్నాడా? ఈ ఏడాదిలోనే ఆమె పెళ్లి చేసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సాయిపల్లవి స్వయంగా సమాధానం ఇచ్చింది. లాక్ డౌన్ టైమ్ లో తన కోసం తల్లిదండ్రులు ఓ సంబంధం చూసిన విషయాన్ని ఆమె బయటపెట్టింది.
“పెళ్లి చేసుకోమని లాక్ డౌన్ టైమ్ లో అమ్మానాన్న నాపై చాలా ఒత్తిడి చేశారు. వాళ్లు లాక్ డౌన్ తో భయపడ్డారు. ఎవరు ఎప్పుడు ఉంటామో తెలియదు, ఇప్పుడే పెళ్లి చేసేయాలని అనుకున్నారు. ఓ సంబంధం కూడా చూశారు. కానీ నేనింకా పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పాను. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ గా తయారై, మరో వ్యక్తికి సపోర్ట్ గా నిలబడగలనో అప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను.”
తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని తను కలవలేదని, ఫొటో కూడూ చూడలేదని సాయిపల్లవి స్పష్టం చేసింది. చర్చలతోనే ఆ సంబంధం ఆగిపోయిందని తెలిపింది. మరోవైపు తన కులంలో అబ్బాయి దొరకడం కష్టమని కూడా అంటోంది ఈ నటి.
“మా కమ్యూనిటీలో అమ్మాయిలు-అబ్బాయిలు చాలా తొందరగా పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిలైతే 25-26 ఏళ్లకే పెళ్లిళ్లు చేసుకుంటారు. కాబట్టి మా కమ్యూనిటీలో నాకు సంబంధాలు దొరకడం కష్టమే అనుకుంటున్నాను. ఇక తెలుగింటి కోడలు అవుతానా అవ్వనా అనేది నా చేతిలో లేదు. నేనింకా పెళ్లి గురించి అంత దూరం ఆలోచించలేదు. ఏమో.. ఇలానే సింగిల్ గా ఉండిపోతానేమో. లేదంటే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటానేమో.”
ఇలా పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది సాయిపల్లవి. తను మంచి అమ్మాయిని కాదని, మంచిగా మారేందుకు రోజూ ధ్యానం చేస్తానని తెలిపిన సాయిపల్లవి.. విరాటపర్వంలో చేసిన వెన్నెల పాత్ర తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.