కర్నాటకలో హఠాత్తుగా భలే డిమాండ్ వచ్చింది. రాజకీయం అన్ని రకాలుగా దిగజారి నిక్కర్ల వరకూ వచ్చింది. కాంగ్రెస్ నిక్కర్లను తగలబెడుతుంటే, బీజేపీ నిక్కర్లను కొరియర్లో కాంగ్రెస్ లీడర్లకి పార్శిల్ చేస్తోంది. వచ్చిన నిక్కర్లను కలిపి మళ్లీ మోదీకి పంపుతామని కాంగ్రెస్ అంటూ వుంది. ఈ రకంగానైనా నిక్కర్ల వ్యాపారులు, తయారీదారులు బాగుపడితే మంచిది.
అసలు విషయం ఏమంటే RSS కార్యకర్తలు నిక్కర్లు ధరిస్తారు. వాళ్ల డ్రెస్‌కోడ్ అది. స్కూల్ టెక్ట్స్ పుస్తకాల్లో కాషాయ విద్యను ప్రవేశ పెడుతున్నారనే నిరసనతో NSUI కార్యకర్తలు టిప్టూర్ (టుంకూరు జిల్లా)లో విద్యామంత్రి బీసీ. నగేష్ ఇంటి ముందు నిక్కర్లు తగలబెట్టారు. దీన్ని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య సమర్థించుకున్నారు. “మేము ఒక నిక్కర్ తగలబెడితే ఇంటినే తగలబెట్టినట్టు పోలీసులు , బీజేపీ కలిసి ప్రచారం చేస్తున్నారు” అన్నారు.
అక్కడితో ఆగకుండా RSS మత సంస్థ ఆ చడ్డీలు మమ్మల్ని ఏం చేయలేరని కూడా అన్నారు. దాంతో వివాదం ముదిరి RSS నుంచి కాంగ్రెస్ ఆఫీస్‌కి నిక్కర్లు పార్శిల్ వచ్చాయి.
ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ సిద్ధరామయ్యకి పనిలేదు అన్నారు. విద్యామంత్రి మాట్లాడుతూ 65 ఏళ్లుగా పిల్లలకి తప్పుడు పాఠాలు నేర్పుతున్నారని అన్నారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ఒక అడుగు ముందుకేసి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ చడ్డీ ఊడిపోయి చాలా కాలమైందని అన్నారు. మన దగ్గరే కాదు, కర్నాటకలో కూడా రాజకీయ కాలుష్యం కావాల్సినంత ఉంది.
టెక్ట్స్ పుస్తకాల్లో మతపరంగా గాయపరిచే అంశాలున్నాయని రోహిత్ చక్రతీర్థ అనే రచయిత ఆధ్వర్యంలో 15 మంది కమిటీని వేశారు. వీళ్లు పుస్తకాల్లోని అంశాలను మార్చారు. భగత్‌సింగ్‌ని తీసేసి RSS నాయకుల ఉపన్యాసాన్ని పాఠంగా పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధుల్ని కూడా విస్మరించారని ఆరోపణ.