చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడింది. దాదాపు దక్షిణ ధృవం మొత్తం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. మరి చంద్రయాన్ పరిస్థితేంటి? విక్రమ్ మేల్కొందా.. ప్రగ్యాన్ లో కదలిక వచ్చిందా? ప్రస్తుతానికైతే గుడ్ న్యూస్ లేదు. ల్యాండర్, రోవర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇస్రో ప్రయత్నించింది. కానీ ఫలితం కనిపించలేదు.
చంద్రయాన్-3 మిషన్ సూపర్ సక్సెస్ అయింది. ల్యాండర్ అద్భుతంగా చంద్రుడి దక్షిణ దృవంపై దిగింది. ఆ వెంటనే రోవర్ కూడా చంద్రుడిపై అడుగుపెట్టింది. చకచకా పని ప్రారంభించింది. ల్యాండర్, రోవర్ రెండూ ఒకదాన్ని ఒకటి సమన్యయం చేసుకుంటూ అద్భుతమైన సమాచారాన్ని, ఫొటోల్ని భూమికి చేరవేశాయి.
చంద్రుడిపై ఒక రోజు అంటే, భూమిపై అది 14 రోజులతో సమానం. ఈ లెక్క ప్రకారం, చంద్రుడి దక్షిణ దృవంపై చీకట్లు అలుముకున్నాయి. దీంతో విక్రమ్, ప్రగ్యాన్ ను స్లీప్ మోడ్ లో పెట్టింది ఇస్రో. అప్పట్నుంచి నిద్రావస్తలోనే ఉన్నాయి ల్యాండర్-రోవర్.
చీకట్లు అలుముకున్న తర్వాత దక్షిణ దృవంపై ఉష్ణోగ్రతలు మైనస్ 120 డిగ్రీలకు పడిపోతాయి. కొన్నిసార్లు చలి మైనస్ 200 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది. అంత చలిని తట్టుకొని తిరిగి విక్రమ్, ప్రగ్యాన్ పనిచేస్తాయో లేదో చెప్పలేమని గతంలోనే ప్రకటించారు ఇస్రో అధికారులు.
ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. మొన్నటి నుంచే చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి ప్రసరించడం మొదలైంది. ఇవాళ్టికి ల్యాండర్, రోవర్ ఛార్జ్ అవుతాయి. కాబట్టి వాటితో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది ఇస్రో. కానీ ఎలాంటి సిగ్నల్స్ అందలేదు.
అయితే తమ ప్రయత్నాలు ఆపమంటున్నారు ఇస్రో అధికారులు. ల్యాండర్, రోవర్ తో కమ్యూనికేషన్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని ప్రకటించారు. అంత చలిని తట్టుకొని సైతం, ల్యాండర్-రోవర్ తిరిగి యాక్టివేట్ అయితే, అంతరిక్ష రంగంలోనే ఇదొక చరిత్ర అవుతుంది. దాని కోసమే ఇస్రో ప్రయత్నం.