సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకం.. 120 ఏళ్ల బంధానికి సెలవు

బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒడిదొడుకులతో నిండిన వ్యవస్థ. నమ్మకం నుంచే మొదలయ్యే ఈ బిజినెస్ లో ఇప్పటివరకూ చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. భారతీయ సంస్థలతో పాటు, విదేశీ కంపెనీలు కూడా భారత్…

బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒడిదొడుకులతో నిండిన వ్యవస్థ. నమ్మకం నుంచే మొదలయ్యే ఈ బిజినెస్ లో ఇప్పటివరకూ చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. భారతీయ సంస్థలతో పాటు, విదేశీ కంపెనీలు కూడా భారత్ లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. లాభసాటిగానే ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడో భారీ విలీనం భారత్ లో సిటీబ్యాంక్ ని పాత జ్ఞాపకంగా మార్చేసింది.

భారత్ లో తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్ లో విలీనం చేసింది సిటీ గ్రూప్. దీంతో 1902లో భారత్ లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆ గ్రూప్ ఇప్పుడిక చరిత్రలో మాత్రమే మిగిలినట్టయింది. కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్ లో తన మొదటి బ్యాంకింగ్ బోర్డ్ ని తాజాగా సిటీ బ్యాంక్ తొలగించింది.

1902లో భారత్ లో ప్రవేశించిన అమెరికా దిగ్గజ సంస్థ సిటీ గ్రూప్, 1985నుంచి బ్యాంకింగ్ బిజినెస్ ని పూర్తి స్థాయిలో విస్తరించింది. అయితే ఇటీవలి పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడింది.

యాక్సిస్ బ్యాంక్ తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్ లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. 12,325 కోట్ల రూపాయల భారీ డీల్ ఇది. మార్చి 1 నుంచి ఇండియాలో కన్జూమర్ బిజినెస్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకుంటోంది సిటీ బ్యాంక్. ఈ డీల్ తో భారత్ లో యాక్సిస్ బ్యాంక్ కార్యకలాపాలు మరింతగా విస్తరించబోతున్నాయి. భారత్, చైనా ఇతర 11 ప్రాంతాల్లో కూడా సిటీ గ్రూప్ బ్యాంకింగ్ నుంచి తప్పుకుంది.

2012లో, బ్రిటిష్ బ్యాంకింగ్ సంస్థ బార్క్లేస్ కూడా భారత్ లో కార్యకలాపాలను పూర్తిగా తగ్గించింది. కేవలం మెట్రో నగరాలకే తమ సేవలు పరిమితం చేసింది. మూడోవంతు బ్రాంచ్ లను మూసివేసింది. కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, డ్యూయిష్ బ్యాంక్, HSBC వంటి ఇతర విదేశీ బ్యాంకులు.. కూడా భారత్ లో కార్యకలాపాలు పూర్తిగా తగ్గించేశాయి. వివిధ కారణాలతో ఇవి తమ సేవలను పరిమితం చేశాయి. ఇప్పుడు సిటీ గ్రూప్ కూడా యాక్సిస్ తో ఒప్పందం చేసుకుని, కన్జూమర్ సేవలకు సంబంధించి భారత్ నుంచి నిష్క్రమించింది.