విరహ వేదన.. ప్రియుడు లేదా ప్రేయసి దూరంగా ఉంటే భాగస్వామిలో కలిగే భావోద్వేగం పేరు ఇది. దీనిపై తెలుగులో చాలా పాటలు వచ్చాయి కూడా. కానీ ఇకపై ఇలాంటి విరహ వేదన అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రేయసి ఎంత దూరంగా ఉన్నప్పటికీ, ఆమెకు ముద్దులివ్వొచ్చు. ఈ మేరకు చైనాకు చెందిన ఓ కంపెనీ సరికొత్త పరికరాన్ని, సాఫ్ట్ వేర్ ను రూపొందించింది.
ఈ పరికరం పేరు 'రిమోట్ కిస్'. సిలికాన్ లిప్స్ తో తయారుచేసిన ఈ పరికరం, ప్రత్యేకంగా తయారుచేసిన ఓ యాప్ కు అనుసంధానమై ఉంటుంది. మనం ఎవరికైతే లిప్ కిస్ ఇవ్వాలనుకుంటున్నామో, వాళ్లకు ముందుగా వీడియో కాల్ చేయాలి. తర్వాత ఈ సిలికాన్ లిప్స్ పై ముద్దుపెట్టాలి.
వ్యక్తి పెదవుల కదలిక, వేడి, స్పర్శ, ఒత్తిడి.. ఇలా సమస్త సమాచారాన్ని ఆ సిలికాన్ లిప్స్ సంగ్రహిస్తాయి. యథాతథంగా అటువైపు ఉన్న వ్యక్తికి అందిస్తాయి. దీంతో భాగస్వామిని లిప్ కిస్ పెట్టుకున్న అనుభూతి కలుగుతుంది.
చైనాకు చెందిన ఝాంగ్ జూ టెక్నాలజీస్ అనే సంస్థ, ఈ పరికరం పేటెంట్స్ దక్కించుకుంది. చైనాలోని ఈ-కామర్స్ సైట్స్ లో ఈ రిమోట్ కిస్ ను అమ్మకానికి పెట్టారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 3వేల రూపాయలు.
ఇకపై ప్రేయసి లేదా ప్రియుడు దూరంగా ఉన్నాడని బాధపడనక్కర్లేదు. ఎంత దూరంలో ఉన్నప్పటికీ, ఈ ఉపకరణం ద్వారా రోజుకు ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు ఇచ్చుకోవచ్చు. ఇండియాలోకి ఇంకా ఈ డివైజ్ రాలేదు.