Advertisement

Advertisement


Home > Politics - National

కాంగ్రెస్ కు భారీ సీట్లిచ్చే రాష్ట్రం అదే!

కాంగ్రెస్ కు భారీ సీట్లిచ్చే రాష్ట్రం అదే!

లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ కు దేశంలో ఏ పాటి సానుకూల‌త ఉంటుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా నిలుస్తోంది. ప్ర‌త్యేకించి ఉత్త‌ర‌భార‌తంలో కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కోలుకుంటుంద‌నే దాఖ‌లాలు ఏమీ క‌నిపించ‌డం లేదు.

ఇటీవ‌లి అయోధ్య రామమందిరం ఉత్స‌వంతో బీజేపీ నార్త్ లో స్వీప్ చేస్తుంద‌నే అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ‌లో త‌ప్ప ఎక్క‌డా ప‌రువు ద‌క్కించుకోలేక‌పోయింది. ఇలాంటి నేప‌థ్యంలో మ‌రోసారి ఉత్త‌రంలో బీజేపీ హ‌వానే అనే అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌రిష్టంగా సీట్లు ద‌క్కుతాయ‌ని అంటోంది ఒక స‌ర్వే. పీపుల్స్ ప‌ల్స్- సౌత్ ఫ‌స్ట్ వెల్ల‌డించిన స‌ర్వే ప్ర‌కారం తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఎనిమిది నుంచి ప‌ది ఎంపీ సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఈ స‌ర్వే అంచ‌నాలే నిజ‌మైతే.. దేశంలోనే కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వ‌ర‌స‌లో నిలిచే అవ‌కాశం ఉంది. క‌ర్ణాట‌క‌లో కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెగ్గినా.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అంచ‌నాకు రాలేక‌పోతున్నారు!

అయోధ్య మందిరం అంశం క‌ర్ణాట‌క‌లో కూడా గ‌ట్టిగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌న్న‌డీగులు కాంగ్రెస్ వైపునే నిలిచినా, లోక్ స‌భ‌కు ఎటు మొగ్గుచూపుతార‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే! కాంగ్రెస్ క‌ష్టించి ప‌ని చేసి క‌ర్ణాట‌క‌లో ప‌దికిపైగా ఎంపీ సీట్ల‌ను నెగ్గినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. మ‌రోవైపు అక్క‌డ బీజేపీ-జేడీఎస్ లు పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. అది జ‌రిగితే కాంగ్రెస్ కు మ‌రింత‌గా పోరాడాల్సి ఉంటుంది. 

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల విజ‌యం ఊపులో కాంగ్రెస్ కు ఎనిమిది నుంచి ప‌ది ఎంపీ సీట్లు ద‌క్క‌వ‌చ్చ‌ని పై స‌ర్వే అంచ‌నా వేస్తోంది. ప్ర‌త్యేకించి అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే కాంగ్రెస్ కు ఒక శాతం ఓట్లు కూడా పెర‌గ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు వేసింది ఈ స‌ర్వే. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే బీఆర్ఎస్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ఆరు శాతం ఓట్ల‌ను కోల్పోతుంద‌నే అభిప్రాయాన్ని ఇది వ్య‌క్తం చేసింది. ఆ పార్టీ మూడు నుంచి ఐదు ఎంపీ సీట్ల‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని, బీజేపీ రెండు నుంచి నాలుగు సీట్ల‌ను సంపాదించుకోవ‌చ్చ‌ని ఈ అధ్య‌యనం అంచ‌నా వేసింది. య‌థారీతిన ఎంఐఎం ఒక ఎంపీ సీటును పొంద‌వ‌చ్చని పేర్కొంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?