కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించి విపక్షాలను అధికార పీఠంపై ప్రతిష్ఠింప చేయడానికి భాజపాయేతర శక్తులన్నీ ఇం.డి.యా. అనే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇం.డి.యా. కూటమిలోని పార్టీల ఐక్యత గురించి తొలి నుంచి సందేహాలు ఉండనే ఉన్నాయి.
కూటమిలో ఉండే ముఖ్య పార్టీల నాయకులందరూ ఎవరికి వారు తమ పార్టీకే ప్రధాని పదవి దక్కాలని కోరుకుంటున్నారు. కనీసం కన్వీనర్ ఎవరనేది ప్రకటించే పరిస్థితి, ఆ మాత్రం ఐక్యత ఆకూటమిలో లేవు. దీనికి తగ్గట్లుగా.. G20 సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఈ ఇండియా కూటమిలో కొత్త ముసలం పుట్టిస్తోంది.
ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన విందుకు కేవలం 170 మందిని మాత్రమే ఆహ్వానించారు. వీరిలో కొందరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి ఎవరికీ కూడా ఆహ్వానం అందలేదు. మాజీ ప్రధాన మంత్రుల కోటాలో దేవే గౌడ, మన్మోహన్ సింగ్ లకు పిలుపు వచ్చింది. అయితే ఈ ఇద్దరు నాయకులు కూడా అనారోగ్య కారణాల వలన తాము రాలేకపోతున్నట్లుగా ముందుగానే రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చేశారు.
సోనియమ్మను పిలవనప్పుడు తాను మాత్రం ఎలా వెళ్ళగలను మన్మోహన్ సింగ్ అనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ, మొత్తానికి వారు హాజరు కాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం విందుకు హాజరయ్యారు. ఈ వ్యవహారామే ఇం.డి.యా. కూటమిలో ముసలం పుట్టించేలా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీ రాష్ట్రపతి డిన్నర్ కు వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు. ఆ డిన్నర్ కు వెళ్లక పోతే ఏమైంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన మమతా దీదీ దీనికి ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైఖరి గమనిస్తే ఇండియా కూటమి మీద వారు కర్ర పెత్తనం చేయాలని కోరుకుంటున్నట్టుగా ఉంది.
కాంగ్రెస్ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తే అది కూటమి మనుగడకే ప్రశ్నార్ధకం అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక్క విందు.. కూటమి ఐక్యతలో ముసలం పుట్టిస్తోందా? అని పలువురు నవ్వుకుంటున్నారు.