డికె అరుణ.. పాపం ఆశ తీరకపోయెనే!

‘ఆకు దాకా వచ్చిన కూడు నోటికి అందకపోవడం’ అంటే ఇదే! పాపం తెలంగాణలో ప్రస్తుతం బిజెపిలో ఉన్న సీనియర్ నాయకులు డికె అరుణ పరిస్థితి ఇంతకంటె చోద్యంగా ఉంది. నోటిదాకా వచ్చినది కూడా డీకే…

‘ఆకు దాకా వచ్చిన కూడు నోటికి అందకపోవడం’ అంటే ఇదే! పాపం తెలంగాణలో ప్రస్తుతం బిజెపిలో ఉన్న సీనియర్ నాయకులు డికె అరుణ పరిస్థితి ఇంతకంటె చోద్యంగా ఉంది. నోటిదాకా వచ్చినది కూడా డీకే అరుణ విషయంలో ఆమెకు దక్కకపోవడమే విశేషం. 

2018 గద్వాల అసెంబ్లీ ఎన్నికలలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన డీకే అరుణ ఇంచుమించుగా 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గెలిచిన అధికార పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హై కోర్టు తీర్పు చెప్పింది. ఆయన ఎన్నికను తక్షణం రద్దు చేసి.. డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే నానా ప్రయత్నాల తర్వాత ఆ తీర్పును అమలు చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగానే ఈలోగా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 

తెలంగాణలో 2018 ఎన్నికలకు సంబంధించి ఇటీవలి కాలంలోనే రెండు తీర్పులు వచ్చాయి. కొత్తగూడెంలో అప్పట్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక కూడా చెల్లదని హైకోర్టు ఆ నడుమ తీర్పు చెప్పింది. స్వల్ప తేడాతో ఓడిపోయిన అప్పటి భారాస కేండిడేట్ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని చెప్పింది. అయితే ఆ స్థానం నుంచి తాజాగా జలగం వెంకట్రావు పేరునే అభ్యర్థిగా ప్రకటించడం వలన అక్కడ పెద్దగా సమస్య ఏర్పడలేదు. 

కానీ గద్వాల పరిస్థితి వేరు. గద్వాలలో కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్న నాయకురాలు డీకే అరుణ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దాంతో, అప్పట్లో బారాస అభ్యర్థి గా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వగానే, ఆమె దానిని అమలులో పెట్టాలని ఆశించారు. హైకోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయడం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఉత్తర్వులు తీసుకుని మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు. ఇన్ని రకాలుగా ఆమె ఈ టైం లోనే ఎమ్మెల్యేగా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.

కానీ డీకే అరుణకు కాలం కలిసి రాలేదు. కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నారు. ప్రతి కక్షులకు సుప్రీంకోర్టు నోటీసులు సర్వ్ చేసింది. వారి వివరణ, తదుపరి వాద ప్రతివాదాలు ఇవన్నీ జరగవలసి ఉంది. ఇన్ని పూర్తయ్యేలోగా అసలు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలే వచ్చేస్తాయి. అందుకే డీకే అరుణకు ఊరట అనేది కోర్టులోనే దక్కింది కానీ, వాస్తవంలో కాదని పలువురు అంటున్నారు!