ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు నాలుగో వేవ్ ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటు పెరుగుతున్న కేసులకు, అటు నిపుణుల ప్రకటనకు పొందన కుదరడం లేదు. కరోనాతో మనుషులు మరణిస్తేనే ఫోర్త్ వేవ్ వచ్చినట్టా.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగితే అది ఫోర్త్ వేవ్ కిందకు రాదా? ప్రస్తుత ప్రభుత్వాల వైఖరి ఇలానే ఉంది.
మహారాష్ట్రలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. పాజిటివిటీ రేటు 15శాతం దాటేసింది. టెస్టుల సంఖ్య పెంచుకున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. లక్షణాలు స్వల్పంగా ఉండడంతో లక్షలాది మంది ప్రజలు పరీక్షలు చేయించుకోవడం లేదు. టాబ్లెట్లు వేసుకుంటూ మమ అనిపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధైర్యంతో ఉన్నారు. మరి ఇప్పటివరకు వాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితేంటి?
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఉదృతంగా జరిగిన మాట వాస్తవం. దాని వల్లనే కరోనా వేరియంట్ పెద్దగా ప్రభావం చూపించడం లేదన్నది కూడా అంతోఇంతో నిజం. కానీ ఆ ధైర్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపంగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే, భారతదేశంలో ఇప్పటివరకు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇలాంటి టైమ్ లో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత పెద్దలదే. ఏమాత్రం అశ్రద్ధ వహించినా చిన్నారులకు ఈ మహమ్మారి పాకుతుంది. అది పెను విషాదానికి దారితీస్తుంది.
కరోనా కేసుల్లో బాధితులు ఎక్కువగా పెద్దలే ఉంటున్నారు. పాతికేళ్లు దాటిన వ్యక్తుల్లోనే ఎక్కువగా లక్షణాలు బయటపడుతున్నాయి. చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు తక్కువగా కనిపించాయి. మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ లో చిన్నారులు పెద్దగా కరోనా బారిన పడలేదు. అంతమాత్రాన నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదంటున్నారు వైద్యారోగ్య నిపుణులు.
సీజన్లవారీగా రూపాంతరం చెందుతున్న కరోనా, కొత్త వేరియంట్లతో చిన్నారులపై విజృంభిస్తే మాత్రం చేసేదేం లేదు. ఇప్పటికైనా అందరం మేల్కోవాలి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, వాటినే ఇప్పుడు మరోసారి కొనసాగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓ చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదానికి దారితీయొచ్చు. తస్మాత్ జాగ్రత్త.