రాజకీయ అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక పార్టీ మీద మరొక పార్టీ ఆరోపణలు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణం. అయితే వారు చేసే ఆరోపణలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇతరత్రా విషయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఓటర్ల జాబితాల వరకు వస్తే.. ఒకే రకమైన అక్రమం జరుగుతున్నట్టుగా ఇరు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ అక్రమాలకు ఇరుపార్టీలూ ఎదుటి పార్టీని మాత్రమే బాధ్యులుగా ప్రకటిస్తున్నాయి.
ఇంకా పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఈ అక్రమాలను అరికట్టడానికి ఇరు పార్టీలు కూడా ఒకే పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. ఇక నిజాయితీగల ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం నిజంగానే కోరుకుంటే గనుక.. ఆ సూచనను అమలు చేయడానికి అడ్డు ఏముటుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల్లో దొంగ ఓట్లు నమోదు అయి ఉన్నాయనే రచ్చ కొన్ని నెలలుగా తారస్థాయిలో నడుస్తోంది. తెలుగుదేశానికి చెందిన ఓటర్లను జాబితాల్లోంచి తొలగించారని, ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో దొంగ ఓటర్లను, నకిలీ చిరునామాలతో అధికార పార్టీ వారు నమోదు చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అందుకు తగిన ఆధారాలను కూడా చూపిస్తోంది.
అదే సమయంలో.. అసలు తెలుగుదేశం పార్టీ పాలన సాగుతున్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ అవకతవక ఓటరు జాబితాలను ఇప్పుడు సరిచేయడం మాత్రమే జరుగుతోందని వారంటున్నరు.
మొత్తానికి ఈ పంచాయతీ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. తొలుత చంద్రబాబునాయుడు, ఆ వెంటనే విజయసాయిరెడ్డి సారథ్యంలోని ఆయా పార్టీల బృందాలు కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి తమ తమ వాదనలు వినిపించాయి. ఈ ఇద్దరూ కూడా ఓటరు కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలనే పరిష్కారాన్ని సూచించడం విశేషం.
నిజానికి ఓటరు గుర్తింపునకు ఆధార్ ను లింక్ చేయాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. ఓటరు అక్రమాలను అడ్డుకోవడానికి ఇది తప్ప ఇంకో పరిష్కారం కూడా లేదు. ఎన్ని సార్లు తనిఖీలతో సంస్కరిస్తూ వచ్చినా.. కొత్తగా దొంగఓట్లు రికార్డుల్లోకి రిజిస్టరు అవుతూనే ఉంటాయి. కానీ.. ఎన్నికల సంఘం ఆచరణలో జరగగల జాప్యం, కష్టం గురించి ఆలోచిస్తున్నదో, మరే కారణాలు ఉన్నాయో గానీ.. ఈ వ్యవహారాన్ని జాప్యం చేస్తోంది.
ఇప్పుడు ఏపీలో వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది. రెండు ప్రధాన పార్టీలూ ఇదే డిమాండ్ ను వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఎనిమిదినెలల దూరం కూడా ఉంది. కనీసం పైలట్ ప్రాజెక్టుగా అయినా ఏపీలో ఓటరు-ఆధార్ లింకింగ్ చేయిస్తే ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఎన్నికలు జరుగుతాయి. సీఈసీ ఈ దిశగా చిత్తశుద్ధితో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.