పాక్‌లో అత్యవసర ప‌రిస్థితి

పాకిస్థాన్ చేష్ట‌లు శ్రుతిమించ‌డంతో భార‌త్ ఇక చూస్తూ ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అందుకే ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టాల్సి వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది

పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఊత‌మిస్తూ, చేజేతులా స‌మ‌స్య కొని తెచ్చుకుంది. ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదుల దాడిని ఖండించి, వాళ్ల ఏరివేత‌కు త‌మ వంతు సాయం చేస్తామ‌ని పాకిస్థాన్ ప్ర‌కటించి ఉంటే, నేడు ఈ దుస్థితి ఏర్ప‌డేది కాదు. ఉగ్ర‌వాదుల కోసం త‌మ దేశానికి ఏరికోరి పాకిస్థాన్ ముప్పు తెచ్చుకుంది. గ‌త అర్ధ‌రాత్రి భార‌త్ ర‌క్ష‌ణ ద‌ళాలు మెరుపు దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే.

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై ప‌క్కా స‌మాచారంతో దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు భార‌త్ విదేశాంగ‌శాఖ అధికారి తెలిపారు. సామాన్య పౌరుల‌ను లేనిచోట మాత్ర‌మే దాడులు చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ర‌గిలిపోతోంది. దీంతో పాకిస్థాన్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. ఎమ‌ర్జెన్సీలో ఎలాంటి కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల‌నే విష‌య‌మై ఆ దేశ పాల‌కులు, ఉన్న‌తాధికారులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

మ‌రోవైపు పాకిస్థాన్ సైన్యం దేశ స‌రిహ‌ద్దుల్లో భార‌త్ సైన్యంపై కాలు దువ్వుతోంది. భార‌త్ సైన్యంపై కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే వార్త‌లొస్తున్నాయి. భార‌త్ సైన్యం కూడా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. దీటుగా స‌మాధానం ఇస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిసారి ఉగ్ర‌వాదుల్ని మ‌న దేశంలోని సామాన్యుల‌పై ఎగ‌దోస్తూ, పాకిస్థాన్ పాల‌కులు త‌మ శాడిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

పాకిస్థాన్ చేష్ట‌లు శ్రుతిమించ‌డంతో భార‌త్ ఇక చూస్తూ ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అందుకే ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టాల్సి వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పాకిస్థాన్‌పై దాడుల‌కు యావత్ భార‌త‌వాని అండ‌గా నిలిచింది. ప్ర‌తి ఒక్క‌రూ భార‌త్ త్రివిధ ద‌ళాల‌కు నైతికంగా అండ‌గా నిల‌వ‌డం సంతోషించ ద‌గ్గ విష‌యం.

One Reply to “పాక్‌లో అత్యవసర ప‌రిస్థితి”

Comments are closed.