టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ ఇవాళ సత్యవేడు వెళుతున్నారు. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, సత్య వేడు టీడీపీలో వర్గాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత పార్టీకి చెందిన మహిళ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే సదరు బాధితురాలితో ఎమ్మెల్యే రాజీ కుదుర్చుకున్నప్పటికీ, సస్పెన్షన్ మాత్రం తొలగిపోలేదు. దీంతో ఆయన పాత్ర ఏంటన్నది అంతుచిక్కని పరిస్థితి.
మరోవైపు చంద్రశేఖర్ నాయుడి పెత్తనం పెరిగిపోయింది. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే అభివృద్ధి పనులకు ఆయనే శ్రీకారం చుట్టడం దళితుల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది. ఈ విషయమై ఎమ్మెల్యే ఆదిమూలం కూడా బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యే అంటే అంత అలుసా? ఇదే ఇతర అగ్రకుల ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే చోట ఇలా చేయగలరా? అని ఆయన నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ కూడా సత్యవేడు ఇన్‌చార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీపతిబాబు అనే నాయకుడు కూడా ఇన్‌చార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇలా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ గుంపులుగా విడిపోయి, వాళ్లలో వాళ్లే తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్నారు.
ఒకరంటే మరొకరికి అసలు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో సత్యవేడులో లోకేశ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో అందరికీ ఏకతాటిపైకి తీసుకురావడం లోకేశ్ నాయకత్వానికి పరీక్ష. ఏం చేస్తారో మరి!