భారత్ కు మద్దతు ప్రకటించిన తొలి దేశం…!

గతంలో పుల్వామా దాడి ఘటనను కూడా ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.

భారత్.. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియా విజయవంతంగా ధ్వంసం చేసింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.

ఈ దాడులు జరగగానే ఇండియాకు మద్దతు ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్. పాకిస్తాన్‌పై యుద్ధంలో భారత్ కు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. పాకిస్తాన్‌పై మిస్సైళ్లను సంధించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ తెర మీది కి వచ్చింది. భారత్‌కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిస్సైళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించారు రువెన్ అజర్. ఈ సైనిక చర్యను అన్ని రకాలుగా ఇజ్రాయెల్ సమర్థిస్తుందని తేల్చి చెప్పారు. అమాయకులపై ఉగ్రవాదులు చేసే దారుణమైన నేరాలకు మూల్యం చెల్లించడం సమర్థనీయమని అన్నారు. దాక్కోవడానికి తమకు ఎక్కడా చోటు లేదనే విషయాన్ని ఉగ్రవాదులు గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

గతంలో పుల్వామా దాడి ఘటనను కూడా ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు సైనిక పరంగా భారత్ కు సహకారం అందిస్తామని తెలిపింది. మెరుపు దాడులు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మంచి స్నేహం ఉంది.

అయితే ఈ స్నేహం 1992 నుంచి మొదలైంది. వాస్తవానికి, భారతదేశం సెప్టెంబర్ 17, 1950న ఇజ్రాయెల్‌ను గుర్తించింది. అయితే రెండు దేశాల మధ్య పూర్తి దౌత్య సంబంధాలు జనవరి 29, 1992 నుంచి మొదలయ్యాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య స్నేహం, ఇరు దేశాల ప్రజల స్నేహం ఏర్పడింది. అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతతో సహా చాలా విషయాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. ఇక ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని గాజాపై ఇజ్రాయెల్ తో పోల్చాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇండియా ప్రధాని మోదీకి మంచి స్నేహితుడని, కాబట్టి మోదీ కూడా నెతన్యాహు మనస్తత్వమే ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆయన అన్నట్లే ఇప్పుడు మోదీ, నెతన్యాహు కలిశారు.

One Reply to “భారత్ కు మద్దతు ప్రకటించిన తొలి దేశం…!”

  1. ఇస్రేల్ యుద్ధం ప్రకటిస్తే పలు దేశాల్లో ఉన్న దాదాపు ౩౦ వేలమంది రిజర్వ్ ఆర్మీ కి అప్లికేషన్ పెట్టి జాయిన్ అయ్యారు. మరి మనం ఇక్కడ మన భావాలకు విరుద్ధంగా ఉన్న నాయకులని తిట్టడం లేదా సోషల్ మీడియా లో రాతలు రాయడం నా తో సహా. ఇక ఏమి బాగుపడతాం ?

Comments are closed.