కుంభమేళా సిత్రాలు.. ఈసారి బైక్

విమానం టికెట్ కొనేంత స్తోమత లేదు. దీంతో తన దగ్గరున్న బైక్ పైనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు మహేంద్ర పటేల్.

మొన్నటికిమొన్న చిత్తూరుకు చెందిన నలుగురు కుర్రాళ్లు ఆటోపై మహా కుంభమేళాకు వెళ్లొచ్చారు. కర్నాటకలోని ఉడిపికి చెందిన తండ్రీకొడుకు తమ బైక్ పై కుంభమేళాకు వెళ్లొచ్చారు. ఇప్పుడు 73 ఏళ్ల ఓ వృద్ధుడు బైక్ పై కుంభమేళాకు వెళ్లారు. అది కూడా తన భార్యతో కలిసి.

మహేంద్ర పటేల్ (73), ఆయన భార్య అస్మితా పటేల్ (67) కుంభమేళాకు వెళ్లాలనుకున్నారు. చాన్నాళ్లు ట్రయిన్ టికెట్స్ ప్రయత్నించారు కానీ దొరకలేదు. విమానం టికెట్ కొనేంత స్తోమత లేదు. దీంతో తన దగ్గరున్న బైక్ పైనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు మహేంద్ర పటేల్.

అనుకున్నదే తడవుగా భార్యాభర్తలిద్దరూ ఈనెల 5న తమ స్వస్థలమైన గుజరాజ్ లోని మెసానా నుంచి బైక్ పై బయల్దేరారు. అయితే వాళ్లు నేరుగా కుంభమేళాకు వెళ్లలేదు. మార్గమధ్యంలో మరిన్ని పుణ్యక్షేత్రాల్ని కవర్ చేయాలనుకున్నారు.

అందుకే రాజస్థాన్, పంజాబ్, జమ్ము-కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మీదుగా ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. మధుర, బృందావనం, బర్సానా, అయోధ్య ఆలయాలు సందర్శించి, 15 రోజుల పాటు ప్రయాణించి ఎట్టకేలకు కుంభమేళాకు చేరుకున్నారు.

కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసి అట్నుంచి అటు ఉజ్జయిని ఆలయాన్ని దర్శించడానికి బయల్దేరారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు కూడా చేశారు. ఇన్నాళ్లకు తమకు ఖాళీ సమయం దొరికిందని, కానీ ఎక్కువ డబ్బుల్లేకపోవడం వల్ల బైక్ పై బయల్దేరామని చెబుతున్నారు ఈ దంపతులు.

6 Replies to “కుంభమేళా సిత్రాలు.. ఈసారి బైక్”

Comments are closed.