సమాజం ఆధునికత వైపు అడుగులేస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయి, వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా కిరాతకంగా హత్య చేసే కుటుంబ సభ్యులున్నారు. ఆ పని తండ్రే చేస్తే అది మరీ దారుణం అనే చెప్పాలి. సరిగ్గా అలాంటి దారుణ ఘటనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చనలో జరిగింది.
తండ్రే కాలయముడై కుమార్తెను హత్య చేశాడు. ఆ హత్యను రెండో కుమార్తె చూసింది. ఆమెను కూడా చంపేస్తానని బెదిరించడంతో నోరు తెరవలేదు. చివరకు ఆ హత్యను కరెంట్ షాక్ అని నమ్మించి దహన సంస్కారాలు కూడా చేసేశాడు. చేతులారా చంపి అదే చేత్తో పూడ్చిపెట్టి ఎక్కడలేని నటన ప్రదర్శించాడు దుర్మార్గపు తండ్రి.
అయితే తండ్రి చేసిన ఘాతుకాన్ని చిన్న కూతురు జీర్ణించుకోలేకపోయింది. గ్రామస్తులకు ఆ ఘోరం చెప్పడంతో, వారు పోలీసులకు సమాచారమిచ్చారు, దీంతో ఆ తండ్రి అరెస్ట్ అయ్యాడు.
ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన సమీపంలోని హిందూబేలా గ్రామంలో లల్లన్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. పెద్దమ్మాయి చాందిని వేరే కులం వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులు తమ వివాహానికి అడ్డు చెబుతారన్న అనుమానంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయింది. ముంబై చేరింది. అక్కడే ప్రియుడితో కలసి ఉంటోంది.
ఆ విషయం తెలుసుకున్న తండ్రి లల్లన్ ఆమెను బతిమాలి ఇంటికి తీసుకొచ్చాడు. 20రోజులపాటు మౌనంగానే ఉన్న చాందిని, ఈసారి చెల్లెలు ఆసియాని కూడా తీసుకుని ముంబై వెళ్లింది. మళ్లీ లల్లన్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి వారిద్దర్నీ తీసుకొచ్చాడు. ఈసారి మాత్రం ఊరికే వదిలిపెట్టాలనుకోలేదు. పదే పదే పరువు తీస్తున్న కూతుర్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు లల్లన్.
చాందినిని ఓ గదిలో బంధించి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడు. కర్రతో కొట్టాడు, అన్నం పెట్టకుండా హింసించాడు. ఆ బాధలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. చిన్న కుమార్తె ఆసియాని భయభ్రాంతులకు గురిచేశాడు లల్లన్. అక్క హత్య విషయం ఎవరికైనా చెబితే, ఆమెను కూడా చంపేస్తానన్నాడు. మొదట ఆసియా భయపడింది. చాందిని దహనసంస్కారాలు అయిపోయిన తర్వాత ఆమె గ్రామస్తులకు విషయం చెప్పింది. దీంతో లల్లన్ వ్యవహారం బయటపడింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.