మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు సీబీఐకి షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, విచారణ అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించడం విశేషం. ఈ ఆదేశాలు వైసీపీకి ఊరటనిచ్చేవే.
ఎందుకంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి పదేపదే సీబీఐ విచారణ అధికారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఇరికించడానికే అన్నట్టుగా సీబీఐ విచారణ అధికారి రామ్‌సింగ్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యులను రెడీ చేసేందుకు అన్నట్టు, ప్రత్యర్థుల సూచన మేరకు విచారణ సాగిస్తున్నారని వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించడం తెలిసిందే.
సీబీఐ తరపు విచారణ అధికారిని మార్చాలంటూ దేవిరెడ్డి తులశమ్మ వేసిన పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇవాళ మరోసారి విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. దర్యాప్తు అధికారిని మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు వేగాన్ని పెంచాలని సూచించింది.
వివేకా హత్య కేసులో భారీ కుట్ర జరిగిందని హైకోర్టు చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాజకీయ కారణాల వల్లే హత్య జరిగిందని చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే దోషులను పట్టుకునేందుకు ఈ కారణాలు సరిపోవని పేర్కొంది. స్టేటస్ రిపోర్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అయితే కేసు మెరిట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. సీబీఐ విచారణ అధికారిపై కడప ఎంపీతో పాటు నిందితులంతా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ అధికారి మార్పుతో న్యాయం ఎవరికి జరుగుతుందో మరి!