మద్యం ధరల విషయంలో కర్ణాటక ఆల్ టైమ్ హై రేంజ్ ను అందుకుంటూ ఉంది. బ్రాండెడ్ లిక్కర్, చీప్ లిక్కర్ అంటూ తేడా లేకుండా.. కర్ణాటక లో మద్యం ధర భారీ స్థాయిని అందుకుంది. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కర్ణాటకలో ఇప్పుడు మద్యం ధర భారీ స్థాయికి చేరడం గమనార్హం. ఎంతలా అంటే.. కొన్ని రకాల మద్యం ధర గత కొన్ని నెలల్లోనే ఏకంగా 50 నుంచి 70 శాతం వరకూ పెరగడం గమనార్హం! పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని రీతిలో ఇప్పుడు కర్ణాటకలో మద్యం ధరలు ఉండటం గమనార్హం.
మొన్నటి వరకూ మద్యం విషయంలో ఏపీ ప్రభుత్వ విధానాలు మందుబాబుల నుంచి తీవ్ర విమర్శల పాలయ్యాయి. తాము కోరుకున్న మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, ఊరూపేరూ లేని బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చాయి. ఆ ఊరూపేరు లేని బూమ్ బూమ్ బీర్లకు అనుమతులు ఇచ్చింది మీరేనంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంటోంది ప్రతిపక్షాలను ఉద్దేశించింది. చంద్రబాబు నాయుడుపై ఈ విషయంలో తాజాగా కేసులు నమోదయ్యాయి. మద్యం డిస్ట్రిలరీలకు అయాచితంగా అనుమతులు ఇచ్చారని, ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నష్టం కలిగేలా నిర్ణయాలను తీసుకున్నారనే ఆరోపణలు చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసును కూడా నమోదు చేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం మద్యంపై కఠిన నియమాలను అమలు చేసిన కొత్తలో కర్ణాటక నుంచి కొందరు మద్యం అక్రమరవాణా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రత్యేకించి సరిహద్దు జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు మామూలే. ఏపీలో మద్యం దొరకడం దుర్లభం అనుకున్న దశలో కర్ణాటక నుంచి టెట్రా ప్యాకుల మద్యాన్ని తెచ్చి దాచి పెట్టుకుని అమ్మిన వారున్నారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో ఉన్న మద్యం ధరలకు ఏపీ చిన్నబోయే పరిస్థితి వచ్చింది.
తెలంగాణతో పోలిస్తే.. టీఎస్ రెండు వేల ఐదు వందల రూపాయల ధర ఉన్న ఒక బ్రాండెడ్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర కర్ణాటకలో ఏకంగా 4200 రూపాయల చేరింది. కొన్ని నెలల కిందటి వరకూ తెలంగాణ, కర్ణాటకల్లో మద్యం ధర దాదాపు ఒకే తరహాలో ఉండేది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, కేరళల్లో మద్యం పూర్తిగా ప్రభుత్వాల నియంత్రణలో ఉంది.
తమిళనాట మద్యం వ్యవహారాలను ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంది. కేరళలో కూడా ప్రభుత్వ మద్యం దుఖాణాలే దిక్కు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఒక రకంగా మద్యం కోరుకున్నట్టుగా దొరకదు. అయితే తెలంగాణ, కర్ణాటకలది మాత్రం ఫ్రీ లిక్కర్ పాలసీ. కోరుకున్నట్టుగా, కోరుకున్న మద్యం దొరుకుతుంది. ప్రత్యేకించి తెలంగాణలో అయితే.. చిల్లర అంగళ్లలో కూడా మద్యం అమ్ముకోవచ్చు! గతంలో ఇలా చేస్తే ప్రభుత్వం కేసులు పెట్టేది. అయితే తెలంగాణలో ఇంట్లో ఫ్రిడ్జ్ కలిగిన వారెవరైనా మద్యాన్ని పెట్టి అమ్ముకోవచ్చు! కర్ణాటక ప్రభుత్వం కూడా లిక్కర్ నుంచి విపరీతంగా సంపాదించుకోవాలని తాపత్రయపడుతూ ఉంది.
ప్రత్యేకించి ఇటీవల అధికారంలోకి వచ్చి.. ఉచిత పథకాలను అమలు చేయడానికి అపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు మార్గంగా మద్యాన్నే ఎంచుకుంది. మద్యం తప్ప మరో ఆదాయ మార్గం లేని పరిస్థితుల్లో.. ఏకంగా 50 నుంచి వంద శాతం వరకూ కూడా మద్యం రేట్లను పెంచి కూర్చుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహావసరాలకు కూడా దాదాపు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో సిద్ధరామయ్యకు బొప్పి కడుతూ ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఆదాయం కావాలి. లేకపోతే కనీసం పార్లమెంట్ ఎన్నికల వరకూ కూడా ఆ పథకాలను అమలు చేయడం కష్టం. దీంతో ఎడా పెడా మద్యం రేట్లను పెంచేశారు.
బ్రాండెడ్ లిక్కర్ పై అయితే ఒక్కో బాటిల్ అమ్మకంపై గతంతో పోలిస్తే ఏకంగా వెయ్యి, రెండు వేల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ రేట్ల పెంపుదల ఎంతో కొంత అమ్మకాలపై ప్రభావంగా మారలేని పరిస్థితి ఏర్పడింది. మామూలు పెంపకం అయితే మందుబాబులు కూడా వెనుకాడే వారు కాదేమో! అయితే ఏకంగా సగానికి సగం ధరలు పెరగడం, మొన్నటి వెయ్యి రూపాయలకు దొరికే మద్యానికి ఇప్పుడు 1500 లకు పైగా పెట్టాల్సి రావడం ఎంతో కొంత అమ్మకాలను కూడా ప్రభావితం చేస్తోందని గణాంకాలు చెబుతున్నాయి!