పానీలో ముంచి తీస్తే పానీ పూరీ, మసాలా దట్టిస్తే మసాలా పూరీ, పెరుగు వేసి ఇస్తే దహీ పూరీ, స్వీట్ టేస్ట్ తో మిక్సింగ్ చేసి ఇస్తే సేవ్ పూరీ. ఇలా పానీపూరీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. వీటన్నిటికీ దిమ్మతిరిగే వెరైటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దానిపేరు ఐస్ క్రీమ్ పూరీ. అవును.. మీరు విన్నది నిజమే దాని పేరు ఐస్ క్రీమ్ పూరీ, దాంట్లో వేసి ఇస్తారు ఐస్ క్రీమ్.
వేస్కోండి వీరతాడు..
ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి అంటాడు మాయాబజార్ లో ఘటోత్కచుడు. అలాగే ఎవరో ఒకరు ఎపుడో అపుడు ముందుగా ఓ టేస్ట్ ని రుచి చూపిస్తే, ఆ తర్వాత అదే ట్రెండింగ్ లోకి వస్తుంది. అలాంటిదే ఈ ఐస్ క్రీమ్ పూరీ. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్లేట్ లోని పానీ పూరీలో వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని స్పూన్ తో జాగ్రత్తగా నింపుతాడు. ఆ తర్వాత దానిపై మూడు ఫ్లేవర్ల స్వీట్నర్ ని వేస్తాడు. దానిపైన పానీపూరీ టేస్ట్ కోసం మిక్చర్ చల్లుతాడు. దానిపైన కొత్తిమీర వేస్తాడు. ఇంకేముంది నోరూరించే ఐస్ క్రీమ్ పూరీ రెడీ.
ఈ వీడియోపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఐస్ క్రీమ్ తోపాటు, అది యాడ్ చెయ్, ఇది యాడ్ చెయ్ అంటూ సలహాలిస్తున్నారు. ఈ దెబ్బతో నేను పానీ పూరీ తినడం మానేస్తానంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా ఈ ఐస్ క్రీమ్ పూరీ ఇప్పుడు సోషల్ మీడియాలో 'కూల్' ట్రెండ్ గా మారింది.