నయా రికార్డ్.. సగం జనాభా ఇంటర్నెట్ వాడేస్తోంది

ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి ఏటా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో రికార్డ్ సృష్టించింది ఇండియా. తాజా గణాంకాల ప్రకారం, దేశ జనాభాలో…

ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి ఏటా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో రికార్డ్ సృష్టించింది ఇండియా. తాజా గణాంకాల ప్రకారం, దేశ జనాభాలో సగం మంది ప్రస్తుతం ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు.

సగటున నెలకు ఒకసారైనా ఇంటర్నెట్ వాడుతున్న వినియోగదారుల్ని పరిగణనలోకి తీసుకొని నివేదిక తయారుచేసింది కంటార్ అనే మార్కెట్ డేటా ఎనలిస్ట్ కంపెనీ. ఈ నివేదిక ప్రకారం, దేశజనాభాలో సగం మంది అంటే.. 759 మిలియన్ జనాభా ప్రస్తుతం ఇంటర్నెట్ ను వినియోగిస్తోంది. దేశం ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.

తాజా నివేదిక ప్రకారం, 2025 నాటికి దేశంలో 900 మిలియన్ జనాభా ఇంటర్నెట్ ను వాడతారని తేలింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది నివేదిక.

గడిచిన ఏడాది కాలంలో పట్టణాల్లో ఇంటర్నెట్ ను వినియోగించే యూజర్స్ 6 శాతం పెరగగా, ఇదే ఏడాదికాలంలో గ్రామాల్లో ఇంటర్నెట్ ను వాడే వినియోగదారుల సంఖ్య అమాంతం 14 శాతం పెరిగింది. 2025 నాటికి గ్రామాల్లో 56 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తారని నివేదిక వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా చూసుకుంటే, గోవాలో అత్యథికంగా 70శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇక అత్యల్పంగా బిహార్ లో 32 శాతం మంది జనాభా మాత్రమే ఇంటర్నెట్ ను వాడుతోంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కొత్తగా ఇంటర్నెట్ ను వాడుతున్న వ్యక్తుల్లో 57శాతం మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు, 2025 నాటికి కొత్తగా చేరబోయే ఇంటర్నెట్ యూజర్స్ లో 65శాతం మంది మహిళలే ఉండబోతున్నారనేది నివేదిక సారాంశం.

తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్లాన్స్ అందుబాటులోకి రావడంతో.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. పైగా చేతిలో డబ్బులున్నప్పుడు ఎక్కువమంది గ్రామీణులు మొబైల్స్ కొనడానికి, రీచార్జ్ చేయడానికే మొగ్గుచూపిస్తున్నారట.