దాయాది దేశాల మధ్య సైనికపరమైన ఉద్రిక్తతలు నెలకొనడం కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. 1947 లో కొన్ని గంటల వ్యవధిలో.. బ్రిటిష్ పాలన నుంచి ఈ రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. ఈ రెండు దేశాలమధ్య సరిహద్దు రేఖ వెంబడి.. చెదురుమదురుగా అప్పుడప్పుడూ కవ్వింపు కాల్పులు జరుగుతూ ఉండడం, భారతదేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదముఠాల కార్యకలాపాలు విధ్వంసం చేస్తూండడం చాలా తరచుగానే జరుగుతోంది. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన, యుద్ధం స్థాయిలో జరిగిన దాడులు చోటుచేసుకున్న సందర్భాలు గమనిద్దాం.
1. 1947 కాశ్మీర్ కోసం తొలి యుద్ధం
1947లోనే భారత్ పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. ఆ ఏడాదిలోనే కాశ్మీర్ కోసం ఘర్షణ పడ్డాయి. కాశ్మీర్ ను అప్పటిదాకా పాలిస్తున్న హిందూ రాజు భారత్ లో కలవాలని నిర్ణయించినందున తమకు చెందుతుందని భారత్ వాదించగా.. అక్కడి ముస్లింలు మెజారిటీ పాకిస్తాన్ లో కలవాలని కోరుకుంటున్నందున తమకే చెందుతుందని పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. అనేక నెలలపాటు ఈ యుద్ధం కొనసాగించింది. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంతో.. 1949 లో సీజ్ ఫైర్ ప్రకటించారు. ఎవరి ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం వారిచెంతనే ఉండేలా అప్పటికి నిర్ణయించారు. అయితే మొత్తం కాశ్మీరు ప్రాంతం తమదేనంటూ భారత్ తొలినుంచి వాదిస్తోంది.
2. 1965 మళ్లీ కాశ్మీరు కోసమే..
కాశ్మీరు మీద పూర్తి ఆధిపత్యం తమకే కావాలంటూ.. పాకిస్తాన్ దళాలు.. ఇండియాలోకి చొరబడ్డాయి. సరిహద్దు వెంబడి భారత్ కూడా గట్టిగానే జవాబిచ్చింది. సైనిక, వైమానిక దళాలు పరస్పరం తలపడ్డాయి. చరిత్రలో ట్యాంకులతో జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటిగా దీని గురించి చెబుతుంటారు.
3. 1971 తూర్పు పాకిస్తాన్ కోసం యుద్ధం
పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి విముక్తి, స్వేచ్ఛ కోరుకుంటూ తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాట్లు జరుగుతూండగా.. పాక్ వాటిని అణచివేస్తూ వచ్చింది. ఆ తిరుగుబాటుకు భారత్ మద్దతు ఇవ్వడంతో యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్ లో తిరుగుబాటును అణిచివేసే ప్రక్రియలో వేలమంది మరణించారు. చివరికి ఆ తిరుగుబాటుకు భారత్ మద్దతు ఇచ్చిన తరువాత.. వారు నెగ్గారు. బంగ్లాదేశ్ ఏర్పడింది.
4. 1999 కార్గిల్ యుద్ధం
భారత భూభాగంలో ఉన్న కాశ్మీరులోకి పాకిస్తాన్ సైనిక దళాలు చొరబడడంతో.. కార్గిల్ శిఖరాల మీద భీకరమైన యుద్ధం జరిగింది. ఇరుదేశాలకు కూడా అణ్వస్త్ర ఆయుధాలు సమకూరిన తర్వాత.. జరిగిన మొట్టమొదటి యుద్ధం ఇది. అయితే అణుప్రమాదం తలెత్తలేదు. ఇరువైపులా వందలమంది సైనికులు అమరులయ్యారు. చివరికి పాకిస్తాన్ దళాలను కార్గిల్ ప్రాంతం నుంచి పూర్తిగా తిప్పికొట్టి.. భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది.
5. యూరి దాడులు
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల స్థావరాలున్న యూరి ప్రాంతలో భారత్ సర్జికల్ స్టైక్స్ నిర్వహించింది. కాశ్మీర్ లోని యూరి రీజియన్ లో భారత మిలిటరీ బేస్ మీద పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారం ఈ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు.
6. పుల్వామా దాడులు
కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో ఆత్మాహుతి దాడులు చేసిన ఉగ్రవాది ఏకంగా 40 మంది సైనికులను బలితీసుకోవడం జరిగింది. దీనికి ప్రతీకారంగా.. పాకిస్తాన్ లోని బాలాకోట్ కు సమీపంలోని ఉగ్రవాద శిబిరాల మీద వైమానిక దాడులు నిర్వహించినట్టుగా భారత్ ప్రకటించింది.
ఇప్పుడు పహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రదాడి తరువాత.. మంగళవారం అర్ధరాత్రి తరువాత.. భారత్ పీఓకేలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదస్థావరాల మీద దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా.. పాక్ సైనికులు సరిహద్దు వెంబడి కాల్పులు సాగిస్తుండడం, ఫిరంగిగుళ్లు కురిపిస్తుండడం వల్ల.. మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంటోందని తెలుస్తోంది.