కథ ముగియలేదు.. చంద్రయాన్ పై ఇస్రో ప్రకటన

చంద్రయాన్-3 పార్ట్-2 ఇంకా మొదలుకాలేదు. చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడినప్పటికీ, ల్యాండర్-రోవర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇస్రోకు సిగ్నల్ అందలేదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా 14 రోజులు టైమ్…

చంద్రయాన్-3 పార్ట్-2 ఇంకా మొదలుకాలేదు. చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడినప్పటికీ, ల్యాండర్-రోవర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇస్రోకు సిగ్నల్ అందలేదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా 14 రోజులు టైమ్ ఉందని చెబుతున్నారు. ఈ 2 వారాల్లో ఏదైనా జరగొచ్చనేది వాళ్ల వాదన.

అక్టోబర్ 6న చంద్రుడిపై మరోసారి సూర్యాస్తమయం అవుతుంది. అప్పటివరకు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ను మేల్కొలిపేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉంటారని ఇస్రో ప్రకటించింది. ఒక్కసారి కమ్యూనికేషన్ ఏర్పడితే, చంద్రయాన్-3లో మరో ఘట్టం మొదలైనట్టు అవుతుంది.

విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశామని, అయితే ప్రస్తుతానికి, వాటి నుండి ఎటువంటి సంకేతాలు అందలేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయినప్పటికీ, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తామని తెలిపారు.

అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత, చంద్రయాన్-3 ల్యాండర్, 'విక్రమ్', ఆగష్టు 23న నిర్దేశించని చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకింది. దక్షిణ దృవాన్ని తాకిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ టచ్‌ డౌన్ స్పాట్ అయిన శివశక్తి పాయింట్ నుండి చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా దాటిన తర్వాత, ప్రగ్యాన్ రోవర్ ను సురక్షితంగా పార్క్ చేశారు. సూర్యరశ్మి తగ్గిపోవడంతో.. అలా అటు రోవర్ ను, ఇటు ల్యాండర్ ను స్లీప్ మోడ్ లోకి పంపారు.

చంద్రయాన్-2 ఎలా మేల్కొంటుంది?

“విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ దాదాపు 2 వారాలుగా గాఢ నిద్రలో ఉన్నాయి. ఇది దాదాపుగా ఫ్రీజర్‌ లోంచి ఏదో తీసి దానిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 150 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటాయి కాబట్టి.. ల్యాండర్-రోవర్ వాటిని తట్టుకొని తిరిగి పునరుత్తేజం అవుతాయా అవ్వవా అనేది చెప్పలేని పరిస్థితి.

ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొనాలంటే.. సూర్యరశ్మి వల్ల సౌరఫలకాలు వేడెక్కాలి. అవి బ్యాటరీలను రీఛార్జ్ చేయాలి. ఈ రెండు సక్సెస్ ఫుల్ గా సాగితే, ఆటోమేటిగ్గా సిస్టమ్ ఆన్ ఆవుతుంది.

చంద్రయాన్-3 తదుపరి మిషన్ ఏమిటి?

చంద్రుడి దక్షిణ దృవంపై నీటి ఉనికిని నిర్ధారించడం చంద్రయాన్-3 తదుపరి లక్ష్యం. రోవర్ లో తక్కువ ప్రేరేపిత స్పెక్ట్రోస్కోపీ పరికరం ఉంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న లోహాలన్నింటినీ మనకు చూపించింది. అక్కడ ఆక్సిజన్ ఉనికిని కూడా చూపించింది, కానీ నీటి జాడ కనిపించలేదు.

వాస్తవానికి విశ్వంలో ఎక్కడైనా సిలికాన్ ఆధారిత లోహాలు పగలడం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. లేదా నీరు విచ్ఛిన్నం వల్ల కూడా ఆక్సిజన్ పుడుతుంది. అయితే దక్షిణ దృవంపై హైడ్రోజన్‌ను గుర్తించగలిగితే, హైడ్రోజన్ ఉనికిని గుర్తించడం వల్ల నీరు ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రోజన్ ఎప్పుడూ ఇతర సమ్మేళనంలో భాగం కాదు. కాబట్టి ఆ సందర్భంలో అక్కడ నీరు ఉందని కచ్చితంగా నిరూపించవచ్చు.