టీడీపీ అగ్రనేత ఒకే ఒక్క రోజు సంపాదనపై తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో కల్యాణ్ బెనర్జీ టీడీపీ అగ్రనేతపై చేసిన ఆరోపణ సంచలనం రేకెత్తిస్తోంది. స్టాక్ మార్కెట్ గురించి ప్రస్తావిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేశారన్నారు. ఇదే సందర్భంలో స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనాలని పెద్ద ఎత్తున ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ అగ్రనేత ఒకే ఒక్క రోజులో రూ.521 కోట్లు సంపాదించినట్టు సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ మళ్లీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తోందన్న విస్తృత ప్రచారంతో స్టాక్ మార్కెట్‌లో జోష్ కనిపించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సొంతంగా తగిన సీట్లను సాధించలేకపోయింది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్‌లో కుదుపు. లక్షల కోట్లు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. మరోవైపు టీడీపీ అగ్రనేత కంపెనీకి సంబంధించి షేర్లు మాత్రం బాగా అమ్ముడుపోయాయి. ఒకట్రెండు రోజుల్లోనే సదరు అగ్రనేత ఆదాయం వెయ్యి కోట్లకు పైగా పెరిగినట్టు వార్తలొచ్చాయి.
స్టాక్ మార్కెట్ల ఎగుడుదిగుడుల వెనుక రాజకీయ కోణం వుందనేది టీఎంసీ ఎంపీ ఆరోపణ. లోక్‌సభలో కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ చంద్రబాబు కేసుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. చంద్రబాబును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బాబు అవినీతిపరుడు కాదా? అని నిలదీశారు.