కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మే 10న ఎన్నికలు, 13న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కాగా ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే24న ముగియనుంది. ఈసీ ప్రకటనతో కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
గత ఆరు నెలలు నుండే కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి విడతగా 124 మంది అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం కర్ణాటకపై ఫోకస్ పెట్టింది.
కాగా గత ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లలో గెలుపొందాయి. మరో ముగ్గురు ఇతరులు విజయం సాధించారు. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఏడాదిన్నర కూడా ఆ ప్రభుత్వం నిలబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చిన బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
ఈ సంవత్సరంలోనే మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.