Advertisement

Advertisement


Home > Politics - National

ఒక్క ఓటు కోసం 18 కి.మీ. నడక

ఒక్క ఓటు కోసం 18 కి.మీ. నడక

ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఈరోజు కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడే పెళ్లయిన జంట పెళ్లిపీటల నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు. ఇక వృద్ధులు ఎంతోమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ మనం ఎప్పుడూ చూసేవే. ఓటు కోసం 18 కిలోమీటర్లు నడిచిన ఘటన ఇది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు ఇంత దూరం నడవలేదు. అతడితో ఓటు వేయించేందుకు ఏకంగా ఎన్నికల సిబ్బంది 18 కిలోమీటర్లు నడిచారు. అది కూడా అడవిలో. కేరళలో జరిగింది ఈ ఘటన.

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఏకైక గిరిజన పంచాయతీ ఇడమలకుడి. అక్కడున్న ఓటరు శివలింగం వయసు 92 ఏళ్లు. వయసు రీత్యా తను పోలింగ్ బూత్ కు రాలేదనని, ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటానని, తన మనవడి ద్వారా అర్జీ పెట్టుకున్నాడు. దీన్ని పరిశీలించిన అధికారులు, అతడి కోసం 8 మంది ఎన్నికల సిబ్బందిని నియమించింది.

వాళ్లంతా నిన్ననే ప్రయాణం ప్రారంభించారు. మున్నార్ నుంచి బయల్దేరి, ఇరవకుళం నేషనల్ పార్క్ మీదుగా పెట్టిమూడి చేరుకున్నారు. అక్కడ్నుంచి జీపులో మట్టిరోడ్డుపై కెప్పక్కడ్ చేరుకున్నారు. ఇక అక్కడ్నుంచి రోడ్డు లేదు. అడవిలో రాళ్లపై నడుస్తూ, వాగులు దాటుకుంటూ వెళ్లడమే.

ముగ్గురు మహిళా పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది నిన్ననే తమ ప్రయాణం ప్రారంభించారు. కొండలు, గుట్టలు, వాగులు-వంకలు దాటుకుంటూ ప్రయాణం సాగించారు. ఐదున్నర గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 10 గుడిసెలున్న ఇడమలకుడి చేరుకున్నారు. అందులో శివలింగం ఇల్లు ఒకటి. ఈరోజు అతడితో ఓటు వేయించారు.

అతడు మంచం కదిలే పరిస్థితి లేదు. దీంతో అతడి మంచం చుట్టూనే ఓటు వేసేలా కంపార్ట్ మెంట్ ఏర్పాటుచేశారు. తమ మనవడి సహాయంతో రహస్యంగానే శివలింగం తన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. మళ్లీ ఎన్నికల సిబ్బంది తిరుగుప్రయాణం ప్రారంభించింది. ఐదున్నర గంటల పాటు నడిచి పెట్టిమూడి చేరుకుంది. ఈ సాహస యాత్ర తమకు కలకాలం గుర్తుండిపోతుందని చెబుతోంది ఎన్నికల సిబ్బంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?