కొల్‌కత్తాకి ఒక ప్రత్యేకత వుంది. అన్ని రకాల రవాణా సాధనాలు కనిపించే ఏకైక నగరం. నదిలో పడవలు, సముద్రంలో షిప్‌లు, మెట్రోతో పాటు మనిషి లాగే రిక్షాలు కూడా వుంటాయి. దేశంలో ట్రాంలు ఇంకా వున్న ఒకే నగరం. ఒకప్పుడు మద్రాస్‌లో వుండేవి. సిటీ పెరిగే సరికి తీసేశారు.
రోడ్డు మధ్యలో పట్టాలపై తిరిగే చిన్న రైలు ట్రాం. 1880లో మొదటి ట్రాం కలకత్తాలో కనబడింది. దాన్ని గుర్రాలు లాగేవి. 1902లో ఎలక్ట్రిక్ ట్రాంలు వచ్చాయి. అయితే అంతకు ముందు మద్రాస్‌లో వచ్చాయి. దేశంలో రెండో ఎలక్ట్రిక్ ట్రాంవే కలకత్తా.
1960 నాటికి 52 రూట్లలో 450 ట్రాంలు తిరిగేవి. అయితే ఫ్లైఓవర్‌లు, మెట్రో నిర్మాణం కోసం చాలా రూట్లు తీసేశారు. 1992 తర్వాత సిటీ బస్సులు పెరిగాయి. ట్రాంలు కష్టాల్లో పడ్డాయి. కేవలం మూడు రూట్లలో నడుస్తున్నాయి. బిజీ రూట్‌లో ఒకరోజు ఆదాయం కేవలం రూ.5 వేలు.
అయితే ట్రాంని లాభనష్టాల కింద చూడకూడదని, అదొక సాంస్కృతిక చిహ్నమని నగరవాసుల అభిప్రాయం. అందుకే వాళ్లు ట్రాం ప్రయాణికుల సంఘంగా ఏర్పడ్డారు. 2018 నుంచి ట్రాంలని రక్షించుకోడానికి ఎన్నో ప్రదర్శనలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు.
దాంతో “ట్రాం వరల్డ్ కలకత్తా” పేరుతో ఒక ఫొటో ఎగ్జిభిషన్‌ని , లైబ్రరీని ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాంలు నడిపారు. అయినా ప్రయోజనం లేదు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో 5 వేలు సర్వీసులు నడుస్తున్నపుడు కలకతాలో అరడజను నడపలేరా? అని జనం ప్రశ్న.
ట్రాం అంటే ఒక ప్రయాణ సాధనం కాదు. పాత జనరేషన్ల అనుభూతులు, ఆలోచనలు వున్న ఎమోషన్. ట్రాంలు ఎన్ని ప్రేమకథలు, విరహ వేదనలు మోసి వుంటాయో! ఈ స్పీడ్‌లో ట్రాంలు బతికే అవకాశం లేదు. అయినా జనంలో ఏదో చిన్న ఆశ!
జీఆర్ మహర్షి