ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పని చేయరని, కేవలం అభిప్రాయాలు చెబుతుంటారని ఆమె విమర్శించారు. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలపై పీకే జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌కు మళ్లీ అధికారం దక్కదని ఆయన ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో పీకేపై మమతా కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. గతంలో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి ఆయన పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతాబెనర్జీ మాట్లాడుతూ పీకే కేవలం చంద్రబాబు కోసం మాత్రమే పని చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో పని చేయకుండానే చంద్రబాబుకు అనుకూల ప్రకటనలను పీకే చేస్తున్నారని ఆమె విమర్శించడం గమనార్హం.
చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారని, ఇందుకు సంబంధించి తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందని మమతా బెనర్జీ తెలిపారు. ప్రశాంత్ కిశోర్‌కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయని వ్యంగ్యంగా మమతా బెనర్జీ అన్నారు. 2019లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో జగన్ పాదయాత్ర చేసి ఘన విజయం సాధించారు. అయితే ఆ విజయాన్ని పీకే తన ఖాతాలో వేసుకున్నారు. ఏపీ ఫలితాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వ్యాపారం చేసుకునేందుకు పీకే ప్రయత్నించారు.
ఇందులో కొంత ఆయన విజయం సాధించారు. అయితే తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి, పాదయాత్ర చేశారు. అయితే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. దీంతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టారు. టీడీపీకి ఆయన పని చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పేందుకు పీకే సాహసించకపోవడం చర్చనీయాంశమైంది. కానీ పీకే ఏపీలో చంద్రబాబు కోసం పని చేస్తున్న మమతా బెనర్జీ కుండబద్ధలు కొట్టినట్టు తేల్చి చెప్పారు.