చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య విద్యార్థి దశ నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులే. ఈ దఫా కుప్పంలో చంద్రబాబునాయుడిని ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని ఘోరంగా ఓడించారు. ఆ స్ఫూర్తితో ఎమ్మెల్యే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. చంద్రబాబు ఆట కట్టించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు.
ఈ నేపథ్యంలో బుధవారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో మరోసారి ప్రజానీకాన్ని ఓడించేందుకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు దోచుకున్న ఘనత చంద్రబాబుదే అని ఆరోపించారు.
2014 నుంచి ఐదేళ్ల పాటు తాత్కాలిక రాజధాని పేరుతో సొంత ఎజెండా పెట్టుకుని పనిచేశాడని ధ్వజమెత్తారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకుని కేవలం టీడీపీ వారికే లబ్ధి చేకూర్చారన్నారు.
ఇప్పుడు ఎన్నికలు రావడంతో సూపర్ సిక్స్, మీ భవిష్యత్‌కు నా గ్యారెంటీ అంటూ మోసగించేందుకు ఏవేవో చెబుతున్నాడని బాబుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి, అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పెద్దిరెడ్డి విమర్శించారు. కానీ తన పాలనలో మంచి చేశానని భావిస్తేనే వైసీపీకి ఓట్లు వేయాలని సీఎం జగన్ కోరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.