ప్రేమ మైకంలో ఉన్న శాడిస్టులు తమని కాదన్నవారికి నరకం చూపెడుతుంటారు, కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలు తీస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల చాలానే జరిగాయి. యాసిడ్ దాడులతో మొదలు పెడితే, ప్రాణాలు తీసే వరకు ఇలాంటి వికృతాలకు కొదవే లేదు. అయితే ఇప్పుడో ప్రేమోన్మాది తుపాకీ ప్రేయసి కొలీగ్ పై పేలింది. తుపాకీతో తన ప్రేయసిని బెదిరిస్తున్న ఆ దుర్మార్గుడు ఆవేశంలో ఆమెను కాపాడేందుకు వచ్చిన సహోద్యోగిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఇండోర్ రైల్వే స్టేషన్ బయట జరిగింది.
రాహుల్ యాదవ్ అనే 23ఏళ్ల యువకుడు కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో ఓ యువతి వెంటపడుతున్నాడు. ఆమెను వేధిస్తున్నాడు. అతడి లవ్ ప్రపోజల్ ని ఆమె సున్నితంగా తిరస్కరించింది. కానీ రాహుల్ వదిలిపెట్టకుండా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇండోర్ రైల్వే స్టేషన్ వద్ద మరోసారి ఆమెతో తీవ్రంగా ఘర్షణకు దిగాడు రాహుల్. తనని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ తుపాకీ తీసి ఆమెకు గురిపెట్టాడు.
అయినా సరే ఆమె కాదని చెప్పేసింది. సరిగ్గా అదే సమయంలో రైల్వే స్టేషన్ వద్దకు ఆ యువతితో కలసి ఆఫీస్ లో పనిచేసే సంస్కార్ వర్మ వచ్చాడు. తన ఆఫీస్ కొలీగ్ పై మరో వ్యక్తి తుపాకీ పెట్టడం చూసి అతను అడ్డుకోబోయాడు. అంతే రాహుల్ చేతిలో తుపాకీ పేలింది. బుల్లెట్ వర్మ తలలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే వర్మ కుప్పకూలాడు, ఆస్పత్రిలో మరణించాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే రాహుల్ యాదవ్ కుటుంబ సభ్యులతో సహా పరారయ్యాడు. ప్రేయసిని లొంగదీసుకోడానికి ఆమెను బెదిరించేందుకే స్థానికంగా తుపాకీ కొనుగోలు చేశాడు రాహుల్. ఆమె కాదంటే అది నిజం తుపాకీయేనని నమ్మించేందుకు గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాడు. కానీ కుదర్లేదు, అంతలోనే అటువైపు వచ్చిన వర్మ రాహుల్ ని అడ్డుకోబోయాడు, పాపం అన్యాయంగా బలయ్యాడు.