ఇప్పుడు జీవించి ఉన్న మాజీ ప్రధానుల్లో పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన పదేళ్లు ప్రధానిగా పనిచేశారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. నిజానికి ఆయన ప్రజా నాయకుడు కాదు. ప్రధానిగా పని చేసినన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రఖ్యాత ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్.
మన్మోహన్ ను ఆర్ధిక మంత్రిని చేసి ఆయన ద్వారా దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలు చేయించి పాతాళంలో కూరుకుపోయిన దేశాన్ని మళ్ళీ పైకి లేపారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. అలాంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంటుకు వచ్చారు.
ఆయన ఇంకా రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. 89 ఏళ్ళ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో ఓటు వేయడానికి వచ్చారు. ఆయన నలుగురు అధికారుల సహాయంతో చాలా కష్టంగా ఓటు వేశారు.
ఓటు వేయడానికి వచ్చిన కొందరు ఎంపీలు మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యంలో స్ఫూర్తిదాయకుడని ప్రశంసించారు. ఆరోగ్యం బాగాలేకపోయినా పార్లమెంటుకు రావడం అభినందనీయమని అన్నారు.
మన్మోహన్ సింగ్ ను ఇలా చూస్తే బాధగా ఉందని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని అన్నారు.