ఇండియాలో ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌గ‌వారిదే మెజారిటీ వాటా!

దాంప‌త్యంలో అయినా, లివింగ్ రిలేష‌న్ షిప్స్ పేరుతో అయినా.. మ‌హిళ‌ల‌పై న‌మోద‌వుతున్న తీవ్ర‌మైన నేరాలు వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నాయి.

2022 సంవ‌త్స‌రానికి సంబంధించి నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గ‌ణాంకాల‌ను పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ దినేష్ శ‌ర్మ‌. డొమెస్టిక్ వ‌యొలెన్స్ లో చ‌ట్టాల గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఆత్మ‌హ‌త్య‌ల గ‌ణాంకాల‌ను మెన్ష‌న్ చేశారు. గృహ‌హింస‌కు సంబంధించిన చ‌ట్టాల్లో జెండ‌ర్ ఈక్వాలిటీ గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. అందులో లాజిక్ ఏమో కానీ.. అధికారిక లెక్క‌ల్లో న‌మోదైన ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌గ‌వారివే అధికం కావ‌డం గ‌మ‌నార్హం.

ఆ సంవ‌త్స‌రంలో న‌మోదైన మొత్తం ఆత్మ‌హ‌త్య‌ల్లో 1.25 ల‌క్ష‌ల మంది మ‌గ‌వారికే అని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని ఎంపీ చెప్పారు. 2022 లెక్క‌ల ప్ర‌కారం ఆ యేడాది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న మ‌హిళ‌ల సంఖ్య 42 వేల‌. ఇలా చూస్తే.. మ‌హిళ‌లతో పోలిస్తే మ‌గ‌వారి శాతం చాలా ఎక్కువ అని చెప్ప‌డ‌మే కాకుండా, కుటుంబ ప‌ర‌మైన కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న మ‌గ‌వారి శాతం గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని ఆయ‌న స‌భ‌లో వ్యాక్యానించారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాల్లోనే.. కుటుంబ ప‌ర‌మైన కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న మగ‌వారి సంఖ్య వంద శాతం వ‌ర‌కూ పెరిగింద‌ని విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా డొమెస్టిక్ వ‌యొలెన్స్ చ‌ట్టాలు ఏక‌ప‌క్షంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. బహుశా స్త్రీల నుంచి ఎదుర‌య్యే వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే మ‌గ‌వారి ప‌రిస్థితిని ప‌ట్టించుకోవాల‌ని ఎంపీ స‌భ‌కు నివేదించిన‌ట్టుగా ఉన్నారు.

డొమెస్టిక్ వ‌యొలెన్స్ చ‌ట్టాలు పూర్తిగా స్త్రీల‌కు అనుకూలంగా ఉండ‌టం వ‌ల్ల బాధితులుగా మారే మ‌గ‌వారి ప‌రిస్థితి గురించి ఎంపీ ప్ర‌స్తావించారు. అయితే ఆ చ‌ట్టాల్లోని లోటు పాట్ల‌ను స‌మీక్షించాల‌ని ఎంపీ స‌భ‌లో ప్ర‌స్తావించ‌డంలో త‌ప్పు లేదు కానీ, చ‌ట్టాలు అలా ఉన్నా.. డొమెస్టిక్ వ‌యొలెన్స్ ఘాతుకాలు త‌క్కువేమీ కాదు!

దాంప‌త్యంలో అయినా, లివింగ్ రిలేష‌న్ షిప్స్ పేరుతో అయినా.. మ‌హిళ‌ల‌పై న‌మోద‌వుతున్న తీవ్ర‌మైన నేరాలు వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నాయి. డొమెస్టిక్ వ‌యొలెన్స్ బాధితులు కేవ‌లం స్త్రీలే అన‌డం కూడా త‌ప్పు కావొచ్చు. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో స్త్రీలు పెట్టే కేసుల‌తో కుటుంబాల‌కు కుటుంబాలే కోర్టులు చుట్టూ తిరుగుతున్న దాఖ‌లాలూ ఉన్నాయి. అలాంటివి కూడా బోలెడు ఉంటాయి. అయితే డొమెస్టిక్ వ‌యొలెన్స్ వ‌ల్ల ఆత్మ‌హ‌త్య‌ల గురించి మాట్లాడ‌టం మంచిదే అయినా, డొమెస్టిక్ వ‌యొలెన్స్ వ‌ల్ల జ‌రుగుతున్న హ‌త్య‌ల గురించి కూడా ప్ర‌స్తావించాల్సింది. ఆ హ‌త్య‌ల్లో మ‌హిళ‌లు చేస్తున్న‌వి ఎన్ని, మ‌గ‌వాళ్లు చేస్తున్న‌వి ఎన్ని అనే అంశం కూడా చ‌ట్టాల పై చ‌ర్చ‌లో భాగంగా క్రైమ్ రికార్డ్స్ నుంచి తీసి మాట్లాడి ఉంటే బాగుండేది.

మ‌గ‌వాళ్ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు డొమెస్టిక్ డిస్పూట్స్ రీజ‌న్ గా ఉండ‌టం పెరుగుతోంద‌నేది మాత్రం గ‌మ‌నించాల్సిన అంశం. ఇదే స‌మ‌యంలో.. ఆర్థిక ప‌ర‌మైన వ్య‌వ‌హారాలు, ఉద్యోగాల ఒత్తిళ్లు, ప్రేమ వైఫ‌ల్యాలు, నిరుద్యోగాలు వంటివి కూడా మ‌గ‌వాళ్లలో ఆత్మ‌హ‌త్య‌ల బాధితులు ఎక్కువ‌గా ఉండ‌టానికి ప్ర‌ముఖ‌మైన కార‌ణాలు కావొచ్చు. రాజీప‌డిపోయే త‌త్వం ఉండ‌ట‌డం, ఆర్థిక‌-అప్పుల బాధ్య‌త‌లు త‌క్కువ‌గా మోయ‌డం కూడా మ‌హిళ‌ల్లో ఆత్మ‌హ‌త్య‌ల శాతం త‌క్కువ‌గా ఉండ‌టానికి ప్ర‌ముఖ‌మైన కార‌ణాలు కావొచ్చు.

One Reply to “ఇండియాలో ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌గ‌వారిదే మెజారిటీ వాటా!”

Comments are closed.