మోడీ చేసిన గాయానికి మందు రాసుకుంటున్న కాంగ్రెస్!

మహ గొప్ప పొలిటికల్ మైలేజీ వచ్చేస్తుందనే ఆలోచనతో ఏకంగా మేనిఫెస్టోలోనే ఆ అంశం చొప్పించారు. కానీ, అది ఎంచక్కా, మహా చాణక్యుడు అయిన ప్రత్యర్థికి బ్రహ్మాస్త్రంలాగా అందివస్తుందని వారు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు ఆ…

మహ గొప్ప పొలిటికల్ మైలేజీ వచ్చేస్తుందనే ఆలోచనతో ఏకంగా మేనిఫెస్టోలోనే ఆ అంశం చొప్పించారు. కానీ, అది ఎంచక్కా, మహా చాణక్యుడు అయిన ప్రత్యర్థికి బ్రహ్మాస్త్రంలాగా అందివస్తుందని వారు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం చేసిన గాయాలకు మందు రాసుకునే పనిలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ పాపం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. బజరంగదళ్ నిషేధం అనే మేనిఫెస్టో ప్రస్తావన పార్టీ పుట్టిముంచకుండా నానా పాట్లు పడుతోంది. 

మోడీ దళాన్ని నిలువరించడానికి, వారి పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకతను కలిగించడానికి వారి మతవిద్వేషం నిండిన ప్రచారాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే.. మత విద్వేష ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొంది. ఓ అడుగు ముందుకేసి బజరంగదళ్ వంటి హిందూ అతివాద సంస్థలను నిషేధిస్తాం అని కూడా ఏకంగా తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. 

నరేంద్రమోడీ , ఈ అంశాన్ని కాంగ్రెసు పార్టీకంటె ఎక్కువగా ప్రచారంలోకి తీసుకువెళ్లారు. వారి మేనిఫెస్టో బయటకు వచ్చిన క్షణం నుంచి అదొక్కటే మోడీ ప్రచారాంశం అయింది. ‘హనుమంతుడంటే మీకెందుకు అంత కక్ష’ అంటూ బజరంగదళ్ అనేది హనుమంతుడి సొంత పార్టీ అయినంత విస్తృతంగా ఆయన ప్రచారం చేశారు. అసలే హనుమభక్తి విపరీతంగా ఉండే కర్ణాటకలో మోడీ ప్రచారం తమ పార్టీకి చేటు చేస్తున్నదని కాంగ్రెస్ గుర్తించింది. 

కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. అసలు బజరంగదళ్ నిషేధం వంటి అంశమేమీద పార్టీ ఎదుట లేనేలేదని ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గనుక.. ముఖ్యమంత్రి పీఠం తనకు దక్కుతుందనే ఆలోచనతో ఈ ఎన్నికలకోసం చాలా కష్టపడుతున్న పీసీసీ సారథి డీకే శివకుమార్ మరో గొప్ప వాగ్దానం చేసేశారు. తమ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తాం అని ప్రకటించారు. పురాతన హనుమాన్ ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ కార్యక్రమాలను కూడా చేపడతామని ఆయన ప్రకటించారు. మోడీ దెబ్బకు హనుమంతుడిని ద్వేషించే పార్టీగా తమ మీద ముద్ర పడకుండా వారు ప్రయత్నిస్తున్నారు. 

మరోవైపు మోడీ సాగించిన హనుమ ప్రసంగాల గురించి.. ఆయన ఎన్నికల్లో దేవుడి ప్రస్తావన తెస్తున్నారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కానీ తమాషా ఏంటంటే.. హనుమ గుడులు నిర్మిస్తాం అంటూ కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తోంది.