వైసీపీ నేత, మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఖుష్బూ, రాధిక లాంటి సీనియర్లు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎంపీ నవనీత్ కౌర్ కూడా లిస్ట్ లోకి చేరారు.
తెలుగు సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షలకు దగ్గరైన ఈ మహారాష్ట్రం ఎంపీ, రోజాకు పూర్తి మద్దతు తెలిపారు. ఓ మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేసిన బండారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“మీ ఇంట్లో మీకు భార్య లేదా.. మీకు కూతురు లేదా? ఓ మహిళపై అలాంటి మాటలు ఎలా అంటారు మీరు. ఒక నాయకుడిగా అంటూ స్థాయి దిగజారి ఎలా మాట్లాడతారు? మీకు మీ రాజకీయాలు ముఖ్యమా? ఆంధ్రా-తెలంగాణ మహిళల గౌరవం ముఖ్యమా? నేను తెలుగమ్మాయిని కాదు, కానీ తెలుగులో మాట్లాడతాను, తెలుగు సినిమాలు చేశాను. పార్లమెంట్ లో నాకు తెలుగు ఎంపీలు ఎంతో గౌరవం ఇస్తారు. తమ మనిషిగా చూస్తారు. అలాంటిది ఓ తెలుగమ్మాయి గురించి, ఓ గౌరవ మహిళా నేత గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు లేదా?”
ఇది ఆంధ్రా మహిళకు జరిగిన పరాభవం కాదని. దేశంలో ఉన్న మహిళలందరికీ, మరీ ముఖ్యంగా వర్కింగ్ విమెన్ కు జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు నవనీత్ కౌర్. తనతో పాటు, దేశంలోని మహిళలంతా రోజా వెంట ఉంటామని, తన వ్యాఖ్యలపై బండారు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని నవనీత్ డిమాండ్ చేశారు.