Advertisement

Advertisement


Home > Politics - National

ఆ నగరంలో అడుక్కుంటే జైలుకే..!

ఆ నగరంలో అడుక్కుంటే జైలుకే..!

ఏపనీ చేయలేని నిస్సహాయ స్థితిలో బిచ్చగాళ్లుగా మారుతుంటారు కొందరు, అన్ని పనులూ చేసేంత సామర్థ్యం ఉన్నా కూడా యాచక వృత్తికి అలవాటు పడి అదే జీవనాధారం చేసుకుంటారు మరికొందరు. చిన్న పిల్లల్ని అడ్డుపెట్టుకుని అడుక్కునేవారు, ఆలయాల దగ్గర స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేవారు, ట్రాఫిక్ కూడళ్లలో తిరిగేవారు, ఇంటింకికీ తిరిగి అడుక్కునేవారు.. ఇలా వీరిలో చాలానే కేటగిరీలున్నాయి. అందరినీ ఒకేగాటన కట్టలేం, అందరి పరిస్థితీ ఒకేరకంగా ఉంటుందని అనుకోలేం. కానీ ఇప్పుడు అడుక్కోవడం నేరం అంటూ తీర్మానం చేసింది నాగ్ పూర్ కార్పొరేషన్.

మహారాష్ట్రకు రెండో రాజధాని అయిన నాగ్ పూర్ లో బిచ్చగాళ్ల ఆగడాలు ఇటీవల పెచ్చుమీరాయంటూ పౌరులు కార్పొరేషన్ కి వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. బిచ్చగాళ్లను కంట్రోల్ చేయలేకపోతే వీధుల్లో తిరగలేమంటూ విన్నపాలు ఇస్తున్నారు. దీనిపై కార్పొరేషన్ సీరియస్ గా దృష్టిపెట్టింది. 

బిచ్చగాళ్లందర్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షెల్టర్ హోమ్స్ కి తరలించినా పరిస్థితిలో మార్పు రాలేదు. అక్కడినుంచి తప్పించుకుని వచ్చి మరీ రోడ్లపై ప్రత్యక్షమవుతున్నారు బిచ్చగాళ్లు. షెల్టర్ హోమ్స్ లో తిండి, వసతి, దుస్తులు అన్నీ ఉచితంగా ఇస్తామంటున్నా కూడా ఎవరూ మాట వినడంలేదు. 

దీంతో ఇక జైలుకి పంపిస్తామంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అధికారులు. రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇకపై నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ల పక్కనే కాకుండా ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో నిలబడి అడుక్కోవడం నేరం అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చారు.

G-20 ఎఫెక్ట్ కూడా ఉందా..?

మరోవైపు G-20 సమావేశాలకోసం బిచ్చగాళ్లను తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. G-20 సదస్సుకి వచ్చే విదేశీ ప్రతినిధులకు నాగ్ పూర్ లో బిచ్చగాళ్లు కనపడకుండా చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. 

రోడ్లపై బిచ్చగాళ్లు తిరుగుతుంటే, భారత్ ఇంకా పేద దేశంగా మిగిలిపోయిందనే విషయం విదేశీ ప్రతినిధుల ముందు బయటపడుతుందని, ఎనిమిదేళ్ల మోదీ పాలన అంతా డొల్లే అని తేలిపోతుందని, అందుకే మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

ఇప్పటికే చాలామంది బిచ్చగాళ్లు నగరం విడిచిపెట్టి వెళ్లిపోయారు. మరికొందరు పోలీసుల కళ్లుగప్పి ఇంకా నగరంలోనే తిరుగుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?